భారతదేశంలో షిజాబ్స్.ఇన్

మహిళలకు ‘అధిక నాణ్యత, అధిక విలువ’ గ‌ల ఉపాధి కల్పన‌ను పెంచ‌డ‌మే ధ్యేయంగా రూపొందిన షిజాబ్స్.ఇన్ భార‌త‌దేశంలో శ‌నివారం ప్రారంభ‌మైంది. వారి నైపుణ్యాలకు తగిన ఉన్నత ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా ఉద్యోగాల్లో మహిళలను పెంచడంలో సహాయపడటంపై ఈ పోర్టల్ దృష్టి సారిస్తుంది. షీ జాబ్స్ వివిధ సంస్థలకు వైవిధ్యాన్ని తీసుకురావడానికి, ఉద్యోగాలలో మహిళలకు సమాన అవకాశాలను అందించడానికి సహాయపడుతుంది.

అమెరికాలోని ప్రముఖ మహిళల‌ జాబ్ పోర్టల్ అయిన she-jobs.comను కూడా ఇప్పుడు www.shejobs.inలోనే యాక్సెస్ చేసుకోవచ్చు. పోర్టల్ లోకి వెళ్లి, మహిళలు తమ పేర్లు, వివ‌రాలు రిజిస్టర్ చేసుకోవచ్చు. త‌ద్వారా వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగ అవకాశాలను చూసుకుని, వాటికి దరఖాస్తు చేయడం ప్రారంభించవచ్చు. ఈ సంస్థ వివిధ సంస్థ‌లు చేసే వైవిధ్యభ‌రిత‌మైన‌ ప్రయత్నాలలో వాటికి తోడుగా ఉంటుంది. అమెరికాలో స్థిరపడిన స్వాతి నెలభట్ల అనే తెలుగు మహిళ ఈ సంస్థను ప్రారంభించారు.

పోర్టల్ గురించి SheJobs.in వ్య‌వ‌స్థాప‌కురాలు స్వాతి నెలభట్ల మాట్లాడుతూ, “నా కల నెరవేరింది! ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఏదైనా చేయాలని నేను ఎప్పుడూ కోరుకున్నాను. నేను 2020లో అమెరికాలో she-jobs.com ప్రారంభించినప్పుడు నా కల కొంత‌వ‌ర‌కు నిజ‌మైంది. మేము ఉత్తర అమెరికాకు 2022 సంవత్సరపు ఇంపాక్ట్ కంపెనీగా గుర్తింపు పొందాము. ఉమెన్ మ్యాగజైన్ 2021 కోసం న‌న్ను ఇన్‌స్పైరింగ్ ఉమెన్ లీడ‌ర్స్‌లో ఒక‌రిక‌గా ఎంపిక‌చేసింది. కొవిడ్ మహమ్మారి భారతదేశంలోని చాలా మంది మహిళల ఉద్యోగాలను ప్రభావితం చేసింది. అందుకే ఇక్క‌డి మ‌హిళ‌లు మ‌ళ్లీ ఉద్యోగాలు చేయ‌డానికి వీలుగా వారికి స‌హాయ‌ప‌డేందుకు భారతదేశంలో కంపెనీని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని మేము భావించాము. విభిన్న నేపథ్యాలకు చెందిన మహిళలను వారికి సరిపోయే ఉద్యోగ అవకాశాలకు దగ్గరగా తీసుకురావాలని మా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది” అని చెప్పారు.

కుటుంబంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు సాధారణంగా మహిళలే ఉద్యోగాలు మానేస్తారు. ఇది పిల్లల కోసం కావచ్చు, కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేదా ఏదైనా ఇతర కారణం వల్ల కావచ్చు. మహిళలు ఒక‌సారి ఉద్యోగం మానేశాక‌, తిరిగి చేరాలనుకుంటే, వారికి అవకాశాలు బాగా తగ్గుతాయి. వారు కోరుకునే నైపుణ్యాలు మహిళలకు లేక‌పోవచ్చు, లేదా వారికి సరైన ఉద్యోగం ఉండకపోవచ్చు. SheJobs.in రిటర్న్ షిప్ కార్యక్రమాల కోసం కార్పొరేట్ సంస్థ‌లతో భాగస్వామి అవుతుంది. మ‌హిళ‌లు ఉద్యోగాల‌కు కావ‌ల్సిన నైపుణ్యాల‌ను తిరిగిపొందేలా శిక్ష‌ణ ఇప్పిస్తుంది. తద్వారా వారు ఉద్యోగానికి సిద్ధమ‌వుతారు, త‌మ ఉద్యోగాల‌ను తిరిగి ప్రారంభిస్తారు.

SheJobs.in కేవలం ఇలా ఉద్యోగాలు మానేసిన వారిపైనే కాక‌… ఫ్రెషర్లు, వికలాంగులు, గృహహింస బాధితులు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, కేన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడిన మహిళలు… ఇలా అన్నివ‌ర్గాల‌వారిపైన దృష్టి సారిస్తుంది. వారందరినీ ఉద్యోగావకాశాలకు దగ్గరగా తీసుకురావడమే ఈ వేదిక లక్ష్యం.

“నేను అమెరికాలో చూసింది ఏమిటంటే.. మహిళలు వివిధ కారణాల వల్ల ఉద్యోగాల నుంచి స్వ‌ల్ప విరామం తీసుకుంటారు. త‌ర్వాత మ‌ళ్లీ అదే ఉద్యోగంలో చేర‌డం వారికి బాగా కష్టం అవుతుంది. అందువ‌ల్లే.. ఏ కంపెనీలోనైనా అగ్ర‌స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య తక్కువ. ఇంకా చాలా ఉద్యోగాలలో లింగ వివక్ష ఉంటుంది. అమెరికాకు వెళ్లి వ్యక్తిగతంగా ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు, నేనూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇలాంటి ప‌రిస్థితులు కేవ‌లం అమెరికాలోనే కాద‌ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయ‌ని గుర్తించాను. నా మనస్సులో ఎప్పుడూ.. మహిళలకు ఉద్యోగ అవకాశాలను పెంచడానికి ఏదైనా చేయాలనే ఉంది. ఉద్యోగాల్లో మహిళల సంఖ్య‌ను పెంచడానికి ఏదైనా చేయాలనే బలమైన కోరిక నుంచి పుట్టిన‌దే షీజాబ్స్. మా ప్రయత్నాలకు గుర్తింపుగా, వెస్ట్రన్ యూనియన్, ఎర్నెస్ట్ & యంగ్, సీవీఎస్ లాంటి అమెరికాలోని ప్రముఖ సంస్థ‌లు మాకు గుర్తింపునిస్తున్నాయి. మహిళల నైపుణ్యాలను మెరుగుపరచడానికి వివిధ శిక్షణా సంస్థలతో కూడా క‌లిసి పనిచేస్తాం. లింగ వివక్షను రూపుమాపడం, 21వ శతాబ్దంలో మహిళలకు సమాన ఉపాధి అవకాశాలు ల‌భించే దిశగా పనిచేయడం మా లక్ష్యం” అని స్వాతి నెలభట్ల తెలిపారు.