నాలుగు నెలల చిన్నారికి ఊపిరి పోసిన కిమ్స్ ఆస్పత్రి వైద్యులు
అత్యంత క్లిష్టమైన సమస్యకు చికిత్స చేసి, నాలుగు నెలల చిన్నారి ప్రాణాలను కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు కాపాడారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో చేరిన గాలి బుడగలకు అందించిన చికిత్స వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టు డాక్టర్ రవికిరణ్ తెలిపారు.
“కర్నూలు జిల్లా కోయకుంట్ల ప్రాంతానికి చెందిన మధుమోహన్ దంపతులు రైతు కుటుంబానికి చెందినవారు. వీరికి ఇటీవలే ఓ పాప పుట్టింది. పుట్టిన కొన్ని రోజుల వరకు పాప ఆరోగ్యంగానే ఉంది. కానీ, తర్వాత కొద్ది రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తోందని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శ్వాస తీసుకోవడంలో ఏయే ఇబ్బందులో ఉన్నాయో వివిధ పరీక్షల ద్వారా గమనించాం. పీడియాట్రిక్ ఏఆర్‌డీఎస్, క్లెబ్సియెల్లా న్యుమోనియా తదితర సమస్యలతో బాధపడుతోందని గుర్తించాం. ఇది క్లెబ్సియెల్లా అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ బ్యాక్టీరియా గాలిలో ప్రయాణించి చిన్నారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ చిన్నారిలో కూడా బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి చేరింది. దీని వల్ల కుడి ఊపిరితిత్తిలో గాలిబుడగలు చేరాయి. ఆ గాలిబుడగలు పగలడం వల్ల న్యూమోథొరాక్స్ ఏర్పడింది. దీంతో పాప ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తులు ఒత్తిడికి గురై, అందులో ఉన్న గాలి బుడగలు పగిలిపోయాయి. దీంతో శ్వాస తీసుకోవడం మరితం జటిలమైనది. పాప శ్వాస తీసుకొనే సమయంలో ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం, ఊపిరితిత్తులు గట్టి పడడం, తీవ్రమైన ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపించాయి. కాగా పాప ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో 7 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉంచాల్సి వచ్చింది.
ఈ దశలో ఎలాగైన పాపను రక్షించాలనే ఉద్దేశ్యంతో 20 రోజులకు పైగా శ్రమించాం. ఏడు రోజుల పాటు వెంటిలేటర్ మీద చికిత్స అందించాం. దీంతో ఊపిరితిత్తుల్లో చేరిన గాలి బుడగులు, క్లెబ్సియెల్లా న్యూమోనియా బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోయింది. పీడియాట్రిక్ ఐసీయూలో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ వాసు, ఇతర సిబ్బంది అంతా పాపను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పాప ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ చికిత్స మొత్తం ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా అందించగలిగాం. ఈ కేసులో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. ఊపిరితిత్తుల్లో చేరిన గాలి బుడగల వల్ల, ఒత్తిడి పెరిగి, ఊపిరితిత్తులు గట్టిగా మారి శ్వాస ఆడకపోవడం వల్ల చిన్నారి చనిపోయే ప్రమాదం ఉండేది.
పిల్లలకు సరైన పోషకాహారం ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు టీకాలన్నీ వేయించడం వల్ల ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణ టీకాలతో క్లెబ్సియెల్లాను అరికట్టలేం గానీ, రోగనిరోధక శక్తి బాగుంటే ఇది వచ్చే అవకాశాలు కొంతవరకు తగ్గుతాయి. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. దీంతో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. కాబట్టి ప్రతి ఒక్క చిన్నారినీ కాపాడుకోవాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రుల మీదే ఉంది. చిన్నారులను అనవసరంగా ఎక్కువగా బయటకు తిప్పకుండా సురక్షిత వాతావరణంలో ఉంచాలి” అని డాక్టర్ రవికిరణ్ వివరించారు. తమ బిడ్డను కాపాడి, సురక్షితంగా తమకు అప్పగించినందుకు పాప తల్లిదండ్రులు వైద్యులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ వాసులతో పాటు, కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.