గ్రియెట్‌లో ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం : ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

నగరంలోని ప్రముఖ ఆస్ప‌త్రుల్లో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” సంద‌ర్భంగా మహిళల కోసం ‘ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం’ నిర్వహించింది. గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కోసం ఈ శిబిరాన్ని నిర్వహించారు. గ్రియెట్‌లో చ‌దువుతున్న‌, ప‌నిచేస్తున్న అన్ని వయస్సుల మహిళలు క‌లిసి దాదాపు 320 మంది ఇందులో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలోని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అర్చనా ప్రత్తిపాటి మాట్లాడుతూ, “రాబోయే రోజుల్లో జీవన నాణ్యతను ప్రభావితం చేసే వివిధ ఆరోగ్య స‌మ‌స్య‌ల గురించి యువతులు మరింత తెలుసుకోవాలి. రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ అనేవి సాధారణ క్యాన్సర్ రకాలు. ఇవి ఏ వ‌య‌సులోని మ‌హిళ‌ల‌పై అయినా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల, ఈ క్యాన్సర్లకు కారణాలను, వాటి వ్యాప్తిని ఎలా నిరోధించవచ్చో, ఈ క్యాన్సర్లకు స్వ‌యంగా ప‌రీక్షించుకోవ‌డం, నయం చేయడానికి అందుబాటులో ఉన్న చికిత్సలను యువత అర్థం చేసుకోవడం ముఖ్యం. గోకరాజు రంగరాజు కళాశాలలో యువ, విద్యావంతులైన మహిళలు ఈ రోజు సెషన్ లో చాలా చురుగ్గా పాల్గొన్నారు” అని తెలిపారు.

“ఇటువంటి శిబిరాలు మహిళలకు ఎదుర‌య్యే ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు, ఆరోగ్య ప‌ర‌మైన ముప్పు గురించి తెలుసుకోవడానికి సహాయపడతాయి. పైపెచ్చు, వీటివ‌ల్ల స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించే ప‌రిజ్ఞానం వారికి క‌లుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ శిబిరాన్ని నిర్వహించడం మాకు సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ‌కు వ‌చ్చిన మ‌హిళ‌ల ఆరోగ్యానికి సంబంధించి అన్ని ప్రాథ‌మిక అంశాల‌నూ ప‌రీక్షించాం ” అని ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీనిధి తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దండు శివ రామరాజు, సీఎండీ డివిఎస్ సోమరాజు మాట్లాడుతూ, “మహిళలు పురుషులతో సమానం మాత్ర‌మే కాదు… బంగారు భవిష్యత్తుకు వారే మార్గదర్శకాలు. స్త్రీ ఒక స్వాప్నికురాలు, విశ్వాసి, సాధకురాలు అని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇలాంటి శిబిరాలు మంచి భ‌విష్య‌త్తును రూపొందించడానికి కృషి చేసే మహిళలందరికీ అంకితం” అని చెప్పారు.