మూడున్నర నెలల బాబుకు కొవిడ్
మూడున్నర నెలల వయసున్న బాబుకు కొవిడ్ సోకడమే కాక.. న్యుమోనియా కూడా ఏర్పడి, పరిస్థితి విషమించే వరకు వెళ్లిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ ఎ.మహేష్ ఈ వివరాలను తెలిపారు.
“మూడున్నర నెలల వయసున్న ఆ బాబుకు వారం రోజుల పాటు దగ్గు, జలుబు వచ్చాయి. తొలుత మూడు వేర్వేరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కానీ ఎక్కడా నయం కాకపోగా, ఆక్సిజన్ స్థాయి బాగా తగ్గిపోవడంతో రాత్రి 11 గంటలకు కిమ్స్ సవీరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి గమనించిన వెంటనే ఎమర్జెన్సీలోనే వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. కేవలం జ్వరానికే ఎందుకింత ఇబ్బంది అవుతోందని పరీక్షలు చేయగా, కొవిడ్ నిర్ధారణ అయ్యింది. బాబు గుండె పనితీరు మందగించడంతో పాటు ఊపిరితిత్తులు కూడా సరిగా పనిచేయలేదు. దాంతో నాలుగు రోజులు వెంటిలేటర్ మీద ఉంచి, మరో నాలుగు రోజులు ఆక్సిజన్ పెట్టి చికిత్స చేయాల్సి వచ్చింది. తల్లిదండ్రులు గానీ, ముందు చికిత్స చేసిన ముగ్గురు వైద్యులుగానీ బాబుకు కొవిడ్ అన్న విషయాన్ని గుర్తించలేదు. పది రోజుల తర్వాత బాబుకు పూర్తిగా నయమైంది. బాబు
తల్లిదండ్రులు రాయదుర్గం ప్రాంతానికి చెందిన రోజు కూలీలు. వాళ్ల కుటుంబం మొత్తానికి ఏకైక వారసుడు ఈ బాబే కావడంతో అందరూ ఆ చిన్నారి ఆరోగ్యంపై ఆందోళన చెందారు. చివరకు నయం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కొవిడ్ మూడు దశల్లోనూ ఇంత చిన్న వయసులో కోవిడ్ తీవ్రత అధికంగా రావడం చాలా అరుదుగా కనిపించింది. ఒకవేళ వచ్చినా న్యుమోనియా రావడం, పరిస్థితి ఇంత విషమించడం లేవు. చిన్న వయసులోనైనా కొవిడ్ లక్షణాలు వస్తే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లడం, పరీక్షలు చేయించడం తప్పనిసరి. లేనిపక్షంలో పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ ఎ.మహేష్ తెలిపారు.