అమ్మా నీకు వందనం – కృష్ణమ్మా నీకు వందనం

డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ ప్రతి సంవత్సరం విభిన్నన్నంగా చేసే “సకల మహిళాదినోత్సవం”లోపెద్దాచిన్నా తారతమ్యాలు ఉండవు అంతా సమానత్వమే. తాను చేసే సత్కారం అంతా కూడా అణగారినవర్గాల పట్ల ఆమె చూపే ఆదరణ. “సకల మహిళా దినోత్సవం” పేరుతో సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన మహిళలతో అంటే దివ్యాంగ మహిళలు, మహిళా పారిశుధ్య కార్మికులు, ఆదివాసీ మహిళలు, మహిళా రైతులు, చేనేత మహిళలు, ఉపాధ్యాయిణులు, కళాకారులు ఇలా అన్నివర్గాల మహిళలతో వేడుకలు నిర్వహిస్తుంది.

అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా బేగంపేట, కుందన్ బాగ్ లోని తన ఇంట్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇళ్లల్లో పని చేసుకునే మహిళలు, దివ్యాంగ మహిళలు, మహిళా పారిశుధ్య కార్మికులను తన ఇంటికి ఆహ్వానించి, “ఏడాదంతా మీరు మా కోసం పనిచేస్తారు ఈరోజున నేను మీకు సేవ చేస్తానంటూ” ఆ రోజున తానే స్వయంగా వంట చేసి వారికి వడ్డించడంతో పాటు, కుల, మత, వర్ణ, వర్గ రహితంగా వారితో కూర్చొని సహపంక్తి భోజనాలు చేసింది. పారిశుద్ధ్య కార్మికులను తన నట్టింట్లో కూర్చోబెట్టుకుని బొట్టు పెట్టి, శాలువాతో సత్కరించింది. అదే విధంగా అందరినీ సత్కరించి బట్టలు, నిత్యావసర వస్తువులు అందజేసింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ “మమ్మల్ని చూస్తేనే ఆమడ దూరంగా ఉండే ఈ సమాజంలో, ప్రతియేటా తన ఇంట్లోకి మమ్మల్ని ఆహ్వానించి సత్కరించి, కడుపు నిండా అన్నం పెట్టి ఆదరించడమే గాకుండా సంవత్సరమంతా కూడా ఏ ఆవసరం వచ్చినా ఆపద వచ్చినా ఆదుకుని ఆదరిస్తుంది మా కృష్ణవేణమ్మ” అని ఎంతో ఉద్వేగంగా స్పందించారు.