అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి వైద్యులు

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్పత్రిలోని వైద్యులు ఇటీవ‌ల చిన్న‌పేగులో ర‌క్త‌స్రావం అవుతున్న క‌ణితితో బాధ‌ప‌డుతున్న నాగేశ్వ‌ర‌రావు (52) ప్రాణాల‌ను కాపాడేందుకు సంక్లిష్ట‌మైన ఆప‌రేష‌న్ చేశారు. క‌ణితి క్లోమానికి సమీపంలో ఉండ‌టంతో అది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారింది. చిన్న‌పేగులో ఉన్న ఈ క‌ణితి.. ఇత‌ర కీల‌క అవ‌య‌వాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో రోగికి ప్రాణాపాయం మ‌రింత ఎక్కువైంది.

హైద‌రాబాద్‌కు చెందిన నాగేశ్వ‌ర‌రావుకు గ్యాస్ట్రోఇంటెస్టిన‌ల్ స్ట్రోమ‌ల్ ట్యూమ‌ర్ (జీఐఎస్‌టీ) అనే స‌మ‌స్య బాగా ముదిరిన ద‌శ‌లో ఉండ‌టంతో అత‌డిని అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. జీఐఎస్‌టీ అనేది చాలా అరుదైన కేన్స‌ర్‌. ఇది జీర్ణ‌కోశానికి ప‌క్క‌న ఉండే గోడ‌లో ఉండే స్పెష‌ల్ సెల్స్‌లో ఏర్ప‌డ‌తాయి. అంత‌ర్గ‌త ర‌క్త‌స్రావం కావ‌డంతో రోగి హెమోగ్లోబిన్ స్థాయి చాలా త‌క్కువ‌గా ఉండి, ప్రాణాపాయాన్ని మ‌రింత పెంచింది.

ఈ రోగికి అందించిన చికిత్స‌పై అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ భూప‌తి రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ, “త్వ‌ర‌గా గుర్తిస్తే జీఐఎస్‌టీని న‌యం చేయ‌గ‌లం. కానీ ఈ కేసులో మాత్రం వ్యాధి బాగా ముదిరిపోవ‌డం, అంత‌ర్గ‌త ర‌క్త‌స్రావం కూడా అవుతుండ‌టం, క్లోమానికి బాగా ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం లాంటివి గుర్తించాం. హెమోగ్లోబిన్ త‌క్కువ‌గా ఉండ‌టంతో ముందుగా రోగి ప‌రిస్థితిని చ‌క్క‌బ‌రిచిన త‌ర్వాతే ఆప‌రేష‌న్ చేయ‌గ‌లం. ముందుగా రోగికి హెమోగ్లోబిన్ స్థాయి పెంచేందుకు చికిత్స చేసి, త‌ర్వాత ఆప‌రేష‌న్ చేశాం. చుట్టుప‌క్క‌ల ఉన్న క్లోమం లాంటి కీల‌క అవ‌య‌వాల‌కు ఎలాంటి హాని క‌ల‌గ‌కుండా అత్యంత జాగ్ర‌త్త‌గా చేయాల్సి వ‌చ్చింది. మొద‌ట్లో దాదాపు చేయి దాటిపోయింద‌న్న ప‌రిస్థితి నుంచి ముందుగా రోగి ఆరోగ్యాన్ని కుదుట‌ప‌రిచి, త‌ర్వాత ఆప‌రేష‌న్ చేసి, చివ‌ర‌కు ఐదు రోజుల త‌ర్వాత ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశాం” అని వివ‌రించారు.

రోగి ఇప్పుడు పూర్తిగా కోలుకుని సాధార‌ణ జీవితం గ‌డుపుతున్నారు. ఆప‌రేష‌న్ త‌ర్వాత ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా మామూలుగా ఉన్నారు. ఆప‌రేష‌న్ చేసిన వైద్యుల‌లో డాక్ట‌ర్ భూప‌తి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, డాక్ట‌ర్ మోహ‌న్‌, డాక్ట‌ర్ శివానంద్, డాక్ట‌ర్ ప్ర‌వీణ్ త‌దిత‌రులున్నారు.