ఊబ‌కాయానికి అడ్డుక‌ట్ట వేద్దాం

డాక్ట‌ర్. ప్ర‌దీప్ పాణిగ్రాహి, మెడిక‌ల్ డైరెక్ట‌ర్
సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్, లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్, ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

డాక్ట‌ర్. టాగోర్ మోహ‌న్ గ్రంధి.
సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్, లాప్రోస్కొపిక్, బేరియాట్రిక్‌ స‌ర్జ‌న్,
ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఊబ‌కాయం అంటారు. ఊబ‌కాయానికి చాలా కార‌ణాలు, సంక్లిష్ట కార‌ణాలు ఉంటాయి. చాలా సంద‌ర్భాల్లో జ‌న్యు కార‌ణాల వ‌ల్లే ఊబ‌కాయం వ‌స్తుంది. ఇది పైకి తెలియ‌దు. ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ‌రోజులు డెస్కు వ‌ద్దే కూర్చుని ఉండ‌టం, దూర‌ప్రాంతాల్లో నివాసం ఉండ‌టం వ‌ల్ల కార్ల‌లోనే తిర‌గ‌డం లాంటి ప‌ర్యావ‌ర‌ణ కార‌ణాల‌న్నీ కూడా జీవ‌క్రియ‌లు, స‌మ‌ర్థ కొవ్వు నిల్వ లాంటి వార‌స‌త్వ కార‌ణాల‌కు తోడ‌వుతాయి.

ఊబ‌కాయం వ‌ల్ల గుండెవ్యాధులు, అధిక ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట‌రాల్, స్లీప్ ఆప్నియా, త‌గినంత ఊపిరి అంద‌క‌పోవ‌డం, ఒబెసిటీ హైపోవెంటిలేష‌న్ సిండ్రోమ్‌, ఆస్థ‌మా, బ్రాంకైటిస్, అంబో-సాక్ర‌ల్ స్పైన్ మొక్క డీజ‌న‌రేటివ్ డిసీజ్‌, బ‌రువును మోసే కీళ్లు అరిగిపోయే ఆర్థ‌రైటిస్, గుండెమంట లేదా రిఫ్లక్స్ వ్యాధి, మ‌ధుమేహం, గాల్ బ్లాడ‌ర్ వ్యాధి, ఒత్తిడి వ‌ల్ల మూత్ర‌విస‌ర్జ‌న స‌రిగా లేక‌పోవ‌డం, వీన‌స్ స్టాటిస్ వ్యాధి, డిప్రెష‌న్, కొన్ని కేన్స‌ర్లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. ఆహార నియ‌మాలు, వ్యాయామం, మందులు, శ‌స్త్రచికిత్స‌ల‌తో కొవ్వును తగ్గించే అవ‌కాశం ఉంది. ఇది ఊబ‌కాయ తీవ్ర‌తపై ఆధార‌ప‌డుతుంది.

బేరియాట్రిక్ శ‌స్త్రచికిత్స‌ల‌ను ఉద‌రం, చిన్న‌పేగుల మీద చేస్తారు. త‌ద్వారా దీర్ఘ‌కాలం పాటు బ‌రువు త‌గ్గుతారు. ఇంకా మ‌ధుమేహం, ర‌క్త‌పోటు, ఆర్థ‌రెటిస్ లాంటి స‌మ‌స్య‌ల‌కూ చికిత్స చేయొచ్చు. బేరియాట్రిక్ స‌ర్జ‌రీల‌ను కీహోల్ ప‌ద్ధ‌తిలో (లాప్రోస్కొపిక్) చేస్తారు. అందువ‌ల్ల నొప్పి త‌క్కువ‌గా ఉండ‌టం, త్వ‌ర‌గా కోలుకోవ‌డం, గాయాలు పెద్ద‌గా లేక‌పోవ‌డం లాంటి సానుకూల‌త‌లు ఉంటాయి.

బీఎంఐ 40 దాటిన‌వారు, బీఎంఐ 35-40 మ‌ధ్య ఉండి గుండె-ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు, మ‌ధుమేహం, స్లీప్ ఆప్నియా లాంటి స‌మ‌స్య‌లు కూడా ఉన్న‌వారికి వైద్య‌చికిత్స విఫ‌ల‌మైతే అప్పుడు శ‌స్త్రచికిత్స చేసే అవ‌కాశం ఉంటుంది.

ప్ర‌స్తుతం ఎక్కువ‌గా చేస్తున్న మూడు ర‌కాల శస్త్రచికిత్స‌లు ఇలా ఉన్నాయి..
(1) లాప్రోస్కొపిక్ వెర్టిక‌ల్ స్లీవ్ గ్యాస్ట్రెక్ట‌మీ
(2) లాప్రోస్కొపిక్ మినీగ్యాస్ట్రిక్ బైపాస్
(3) లాప్రోస్కొపిక్ రౌక్స్-ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్

స్లీవ్ గ్యాస్ట్రెక్ట‌మీ ప్రొసీజ‌ర్‌ను సాధార‌ణంగా వెర్టిక‌ల్ స్లీవ్ గ్యాస్ట్రెక్ట‌మీ, వెర్టిక‌ల్ గ్యాస్ట్రెక్ట‌మీ లేదా స్లీవ్ అంటారు. ఇందులో చాలావ‌ర‌కు ఉద‌ర‌భాగాన్ని తీసేస్తారు. అన్న‌వాహిక నుంచి చిన్న‌పేగుల వ‌ర‌కు పొడ‌వైన గొట్టం లాంటి నిర్మాణం మాత్ర‌మే మిగిలి ఉంటుంది.

గ్యాస్ట్రిక్ బైపాస్ ప‌ద్ధ‌తిలో స‌ర్జిక‌ల్ స్టాప్ల‌ర్ల‌ను ఉప‌యోగించి గ్యాస్ట్రోఇంటెస్టిన‌ల్ అనాట‌మీని స‌రిచేస్తారు. ఇందులో చిన్న ఉద‌ర‌సంచిని ఏర్పాటుచేస్తారు. శ‌స్త్రచికిత్స జ‌రిగాక ఒక‌టి లేదా రెండేళ్ల‌లో బ‌రువు త‌గ్గుతారు.

బ‌రువు త‌గ్గే శ‌స్త్రచికిత్స వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌స్త్రచికిత్స త‌ర్వాత చాలామంది రోగులు మ‌ధుమేహం, ర‌క్త‌పోటు మాత్ర‌లు తీసుకోవ‌డం ఆపేస్తారు. శ‌స్త్రచికిత్స త‌ర్వాత చాలామంది రోగులు స్లీప్ ఆప్నియా ల‌క్ష‌ణాలు పోయాయ‌ని, లిపిడ్ ప్రొఫైల్ మెరుగుప‌డింద‌ని చెబుతారు. బ‌రువు త‌గ్గే శ‌స్త్రచికిత్స తర్వాత జీవన నాణ్య‌త మెరుగుప‌డింద‌ని, తాము మ‌రింత క్రియాశీలం అయ్యామ‌ని అంటారు.