బంకర్ల‌లోకి దాగిన పుతిన్ కుటుంబం

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలు త‌మ వైఖ‌రిని వెల్ల‌డిస్తు్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ముదిరి అణుయుద్ధంగా మారుతుందన్న భయం అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లో ఉందని రష్యాకు చెందిన రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు ప్రొఫెసర్‌ వాలెరీ సోలేవే అభిప్రాయపడ్డారు. అందుకే పుతిన్‌ తన కుటుంబ సభ్యులను సైబీరియాలోని భూగర్భ నగరానికి రహస్యంగా పంపించారని చెప్పారు. ఆల్టై పర్వతాల వద్ద ఉన్న ఈ నగరంలో న్యూక్లియర్‌ బంకర్లున్నాయన్నారు. పుతిన్‌ మానసిక, శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు.
గతంలో సైతం పుతిన్‌పై వాలెరీ పలు అభియోగాలు చేశారు. వీటికిగాను ఆయన్ను పోలీసులు పలుమార్లు విచారించారు. ఆయన ఇంటిని సోదా చేసి పలు ఎలక్ట్రానిక్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికీ వాలెరీపై కేసు నడుస్తూనే ఉంది. మాస్కో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ సంస్థలో వాలెరీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పుతిన్‌ అనారోగ్యాలను ప్రజలనుంచి దాస్తున్నారని ఆయన పలుమార్లు విమర్శించారు. అంతేకాకుండా రక్షణ మంత్రి సెర్గే షోగుతో కలిసి పుతిన్‌ క్షుద్రపూజలు కూడా చేశారన్నారు. అయితే వాలెరీ అంచనాలను, అభిప్రాయాలను పలువురు కట్టుకథలుగా కొట్టిపారేస్తున్నారు.