అణుబాంబు దాడికి సిద్ద‌మ‌వుతున్న ర‌ష్యా

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం మ‌రింత ముదురుతోంది. తొలిద‌శ స‌మావేశంలో యుద్ధం నిలిపివేయాలా, కొన‌సాగించాలా అనే అంశంపై పూర్తి క్లార‌టీ రాలేదు. దీంతో మారో మారు చ‌ర్చ‌లకు సిద్ద‌మ‌వుతార‌ని అనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఉక్రెయిన్‌పై అణుబాంబు ప్ర‌యోగించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అణ్వాయుధ వ్యవస్థల అప్రమత్తతకు ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవ‌ల త‌మ సైన్యాన్ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ మేర‌కు రష్యా సైన్యం ఏర్పాట్లు చేసుకుంటోంది. అవ‌స‌ర‌మైతే ఏ క్షణంలోనైనా అణుదాడి చేయ‌డానికి సిద్ధంగా క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్ప‌టికే విన్యాసాల కోసం అణు జలాంతర్గాములను బేరెంట్స్‌ సముద్ర జలాల్లోకి తరలించ‌డం గ‌మ‌నార్హం. సైబీరియా మంచు అడవుల్లో సంచార క్షిపణి ప్రయోగ వ్యవస్థలను ఉంచారు. సముద్ర జలాల్లో విన్యాసాలు చేస్తామ‌ని, పలు అణు జలాంతర్గాములు పాల్గొంటాయని రష్యాకు చెందిన నార్తర్న్‌ ఫ్లీట్ తెలిపింది.

వాటిని కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా సిద్ధం చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని వివ‌రించింది. పలు నౌకా స్థావరాలు ఉన్న కోలా దీవి చుట్టూ యుద్ధ నౌకలను రంగంలోకి దించారు. అవి కూడా విన్యాసాల్లో పాల్గొన‌నున్నాయి. ఇర్కుత్స్క్‌ ప్రాంతంలో అడవుల్లోకి ఖండాంతర క్షిపణుల ప్రయోగ వ్యవస్థలను త‌ర‌లించామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది. ప్ర‌పంచంలో ఏ దేశానికి లేనన్ని అణ్వాయుధాల‌ను రష్యా అభివృద్ధి చేసు‌కుంది.

మరోపక్క, అణుయుద్ధం గ‌నుక జ‌రిగితే భ‌విష్య‌త్తు త‌రాల‌పై కూడా తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ర‌ష్యా అణ్వ‌స్త్రాల‌ను సిద్ధం చేస్తుండ‌డంతో ఊహించ‌ని ప‌రిస్థితులు ఎదురైతే ఎదుర్కోవ‌డానికి అమెరికాలాంటి ఇత‌ర దేశాలు కూడా అణ్వాయుధాల‌ను వాడ‌డానికి సిద్ధ‌మ‌య్యే ప‌రిస్థితులు త‌లెత్తే ముప్పు ఉంది.