రోడ్డు ప్ర‌మాదంలో ఎమ్మెల్యే కుమారుడు

తూర్పు గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎమ్మెల్యే కుమారుడికి తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై.. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమారుడు సుమంత్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. హైవే పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పెద్ద కుమారుడు సుమంత్.. మరో బంధువు లోకేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న హైవే మొబైల్ వాహన సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కాకినాడ తీసుకెళ్లారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మేనల్లుడని తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.