ఎస్ఎల్‌జీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి, బేతెస్థ చర్చి సహకారంతో, మియాపూర్ సుభాష్ చంద్రబోస్ కాలనీలోని చర్చి ప్రాంగణంలో శుక్రవారం “ఉచిత మెగా వైద్యశిబిరం” నిర్వహించింది. ఈ శిబిరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఇందులో 250 మందికి పైగా స్థానికులు పాల్గొని, అక్కడ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు శిబిరంలో పాల్గొన్న వైద్య నిపుణుల నుంచి ఉచిత వైద్యలసహాలు పొందారు.
జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, ఆంకాలజీ, డైటెటిక్స్ మరియు న్యూట్రిషన్ విభాగాలకు చెందిన అత్యున్నత వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొన్నారు. రక్తపోటు, మధుమేహం, ఈసీజీ లాంటి వైద్యపరీక్షలతో పాటు శిబిరంలో పాల్గొన్న వైద్యులను ఉచితంగా సంప్రదించే అవకాశం లభించింది. దాంతోపాటు, ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్లుగా ఏవైనా అదనపు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తే, శిబిరంలో పేర్లు నమోదు చేయించుకున్నవారికి 20% రాయితీ లభిస్తుంది.
ఈ శిబిరం ప్రయోజనాల గురించి ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు మాట్లాడుతూ, “ఎస్ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు సమాజం పట్ల నిబద్ధతతో ఉంటారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఇలాంటి శిబిరాలు పెద్ద ముందడుగు. బేతెస్థ చర్చి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఇక్కడి ప్రజలు ఎంతగానో ప్రశింసించారు. వారు ఇక్కడ అగ్రశ్రేణి సూపర్ స్పెషలిస్టుల సలహాలతో ప్రయోజనం పొందారు” అన్నారు. ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దండు శివరామరాజు కూడా శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్యులు, ఇతర సహాయ సిబ్బంది సేవలను ప్రశంసించారు.
చికిత్స కంటే నివారణ ముఖ్యమన్న విషయంపై అవగాహన కల్పించడంలో ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఎప్పుడూ ముందుంది. ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు మానవ శరీర రక్షణ, ఏదైనా సమస్యను ముందుగానే గుర్తించి దానికి సులభంగా, ఆర్థికభారం లేకుండా చికిత్స చేయించుకుని నయం చేయించుకోవడం ఎలాగన్న అంశంపై రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవగహన కల్పించారు. డాక్టర్ జగన్‌మోహన్ రెడ్డి (ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్), డాక్టర్ వికాష్ కుమార్ శుక్లా (కార్డియాలజిస్టు), డాక్టర్ గౌతమ్ (మెడికల్ ఆంకాలజిస్టు), డాక్టర్ శ్రీనిధి (జనరల్ ఫిజిషియన్), నర్సింగ్, ఇతర సహాయ సిబ్బంది ఈ శిబరంలో పాల్గొన్నారు.