ఈసారి వానలు లేన‌ట్టే : స్కైమెట్

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా పుష్క‌లంగా కురుస్తున్న వాన‌ల‌కు బ్రేక్ ప‌డుతుందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.
వ‌ర్షాలు ఈసారి ముఖం చాటేసే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయని, ఫలితంగా గత రెండేళ్లతో పోలిస్తే రానున్న నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ‘లానినా’ పరిస్థితులు కొనసాగుతుండడంతో 2020, 2021 సంవత్సరాల్లో భారత ఉపఖండంలో విస్తారంగా వర్షాలు కురిసినట్టు తెలిపింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా వేడెక్కుతున్నాయని ఏప్రిల్, మే నెలల్లో మరింత వేడెక్కే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితంగా రెండేళ్ల నుంచి కొనసాగుతున్న లానినా తటస్థంగా మారి, పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే వేడి గాలుల కారణంగా నైరుతి సీజన్‌లో వర్షాల జోరు తగ్గుతుందని స్కైమెట్ అంచనా వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్త కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.