ఏపీ ఐటీశాఖ మంత్రి గౌత‌మ్ రెడ్డి మృతి

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.45 నిమిషాలకు అపోలో అసుపత్రికి చేరుకోగా.. 90 నిమిషాల పాటు వైద్యులు గౌతమ్‌రెడ్డికి ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు. కాగా పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మేకపాటి వారం రోజులపాటు దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొని ఆదివారమే హైదరాబాద్‌ చేరుకున్నారు. గత నెల 22న కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. అయితే సోమవారం ఉదయం గుండె పోటు రావడంతో అపోలో ఆ‍స్పత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.