బీజేపీ నేత దారుణ హత్య
కృష్ణా జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ (భాజపా)కి చెందిన నేత దారుణ హత్యకు గురుయ్యారు. దీంతో ఒక్కసారిగి జిల్లా ఉలిక్కిపడింది. హత్యకు హత్య ప్రతీకారంగా ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలోని వత్సవాయి మండలం చిట్యాలకు చెందిన బీజేపీ యువ నేత మల్లారెడ్డి (34) రాజకీయాల్లో కీలకంగా ఉన్న వ్యక్తి. గ్రామ సమీపంలో పడివున్న ఆయన మృతదేహాన్ని నిన్న గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వత్సవాయిలో శనివారం జిల్లా కిసాన్‌మోర్చా ముఖ్యనాయకుల సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం అర్ధరాత్రి వరకు మల్లారెడ్డి అక్కడే ఉన్నారు.
అనంతరం బీజేపీ నాయకుడు బొడ్డు మల్లికార్జునరావు, మల్లారెడ్డి వేర్వేరుగా ద్విచక్ర వాహనాలపై చిట్యాల వైపు బయలుదేరారు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న మల్లారెడ్డి వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వెంబడించారు. తన ముందు వెళ్తున్న మల్లారెడ్డి కనిపించకపోవడంతో మల్లికార్జునరావు ఆందోళనతో జగ్గయ్యపేటలోని బీజేపీ నాయకులకు సమాచారం అందించారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రాత్రంతా గాలించారు.
నిన్న తెల్లవారుజామున చిట్యాల సమీపంలోని పొలాల్లో మల్లారెడ్డి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఆయన మెడపై కొడవలి గాటు ఉండడాన్ని గుర్తించారు. ఆయన బైక్ పడిపోయిన దగ్గిరి నుంచి 500 మీటర్లు పరిగెత్తినట్టు అక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది.
కాగా, మూడు నెలల క్రితం కూడా ఆయనపై హత్యాయత్నం జరిగింది. మల్లారెడ్డి బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా, ఓ హత్యకేసులో ఆయన ఐదో నిందితుడిగా ఉన్నారు. మల్లారెడ్డి హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.