యువకుడికి కృతిమ వృషణం విజయవంతంగా అమర్చిన కిమ్స్ వైద్యులు
యుక్తవయసులో ఉండగా జన్యుపరమైన కారణాల వల్ల ఒక వృషణాన్ని కోల్పోయిన యువకుడికి కృత్రిమ వృషణాన్ని అమర్చి, కిమ్స్ వైద్యులు ఊరట కల్పించారు. సిలికాన్‌తో చేసిన ఈ కృత్రిమ అవయవం ఉండటం వల్ల అతడు మానసికంగా ఎంతో ఊరడిల్లాడు. ఈ కేసు వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ నవులూరు ఉపేంద్రకుమార్ వివరించారు.
“సుమారు నాలుగేళ్ల క్రితం 17-18 ఏళ్ల వయసులో ఉండగా ఒక యువకుడు వృషణాల్లో ఎడమవైపు తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షలు చేయగా, ఎడమవైపు వృషణం మెలితిరిగిపోయి, దానికి రక్తప్రసారం ఆగిపోవడం వల్ల దాదాపు మృతస్థితికి చేరుకుందని తేలింది. దాన్ని అలాగే వదిలేస్తే కుడివైపు వృషణానికి కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించాము. ఏడాది తర్వాత వస్తే తర్వాత ఏం చేయాలనేది చూద్దామని చెప్పాము. కానీ ఈ మధ్యలో కరోనా కారణంగా ఆస్పత్రికి మళ్లీ అతడు రాలేదు. ఇప్పుడు 23 ఏళ్ల వయసులో ఉన్న ఆ యువకుడు.. ఒకవైపు వృషణం లేకపోవడం వల్ల మానసికంగా కుంగిపోతూ, వైవాహిక జీవితం గురించి కూడా ఆందోళన చెందుతూ మరోసారి ఆస్పత్రికి వచ్చాడు. అతడి పరిస్థితిని గమనించి, సిలికాన్‌తో చేసిన కృత్రిమ వృషణాన్ని అమర్చాలని నిర్ణయించాం. అది సాధారణ వృషణం చేసే పనులేమీ చేయదుగానీ, పైకి మాత్రం రెండు వృషణాలూ ఉన్నట్లు అనిపిస్తుంది. దానివల్ల ఆ యువకుడు మానసికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించే అవకాశం వచ్చింది.
సాధారణంగా ప్రతి వెయ్యిమందిలో ఒకరికి ఇలా వృషణాలు దెబ్బతినే సమస్య వస్తుంది. జన్యుపరమైన కారణాల వల్ల వృషణం మెలితిరుగుతుంది. అలాంటప్పుడు దానికి రక్తప్రసారం ఆగిపోతుంది. అలాంటి సదర్భాల్లో వాళ్లకు విపరీతమైన నొప్పి వస్తుంది. కానీ, నొప్పి రాగానే అది సాధారణ సమస్య అనుకుని జనరల్ సర్జన్ లేదా ఫిజిషియన్ వద్దకు వెళ్తే, వాళ్లు దాన్ని ఇన్ఫెక్షన్‌గా పొరపడి యాంటీబయాటిక్స్ ఇస్తారు. దానివల్ల తాత్కాలిక ఉపశమనం కలిగినా, సమస్య తీవ్రం అవుతుంది. ఈ సమస్య వచ్చిన మొదటి 4-6 గంటల్లోపు యూరాలజిస్టు వద్దకు వెళ్తే, రక్తప్రసారాన్ని పునరుద్ధరించి, వృషణాన్ని కాపాడవచ్చు. ఆ సమయం దాటితే వృషణాన్ని తీసేయడం తప్ప మరో మార్గం ఉండదు. ఈ యువకుడి విషయంలోనూ అలాగే జరగడంతో వృషణం తొలగించి ఇప్పుడు కృత్రిమ వృషణం అమర్చాము.
భవిష్యత్తులో అతడి వైవాహిక జీవితానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అదృష్టవశాత్తు రెండో వృషణం దెబ్బతినకముందే రావడం వల్ల అది వీర్యకణాల ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది రానివ్వదు. సిలికాన్‌తో చేసిన కృత్రిమ వృషణాలు అమర్చడం వల్ల వాళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. అది పూర్తిగా శరీరంలో కలిసిపోతుంది. ఇవి 40 ఏళ్ల నుంచే అందుబాటులో ఉన్నా, చాలామంది వైద్యులు కూడా వీటిని ఉపయోగించిన దాఖలాల్లేవు. వీటివల్ల రోగులు మానసికంగా చాలా ఊరట పొందుతారు” అని డాక్టర్ నవులూరు ఉపేంద్రకుమార్ తెలిపారు.