డీకే అరుణ కుమార్తెపై కేసు నమోదు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తమ ఇంటి సమీపంలో ప్రహరీ గోడ నిర్మించుకుంటున్న వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుపై ఆమెపై కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లో నివాసముండే ఎలిషాబాబు అనే వ్యక్తి తన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటుంటే.. శృతిరెడ్డి ఆ పనులను అడ్డుకున్నారు. పర్మిషన్ లేకుండా ఎలా కడతావు అంటూ అతడ్ని దుర్భాషలాడారు. నాకు పర్మిషన్ ఉంది, కోర్టు ఆడర్ కూడా ఉందంటూ అతను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు ఆమె పిచ్చోడా చెబితే నీకు అర్థం కాదా అంటూ దూర్భాషలాడుతూ కనిపించారు. కోర్టు ఆర్డర్ పంపింన తర్వాత పని మొదలు పెట్టుకో.. నీ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటా నంటే ఊరుకోనంటూ డీకే శృతిరెడ్డి తెలిపింది. చెప్పి చెప్పి విసిగిపోయిన ఎలిషాబాబు తన వద్దనున్న ఆధారాలు, శృతిరెడ్డి దుర్భాషలాడిన విడియోను కోర్టుకు సమర్పించాడు. కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్న తమను శృతిరెడ్డి బెదిరించారని కోర్టుకు తెలిపాడు. మ్యాటర్ సీరియస్ కావడంతో బంజారాహిల్స్ పోలీసులు డీకే శృతిరెడ్డితో పాటు వినోద్ కైలాస్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాంతోపాటు ఐపీసీ 323, 336, 341, 384, 448, 506 R/W 34, SCST POA Act కి 3(C), 3(r), 3(s) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.