బిపిన్ రావత్‌కి అగ్రనేతల సంతాపం
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ ను కోల్పోవడం తీవ్ర వేదనకు గురిచేస్తోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఘటనలో రావత్ అర్ధాంగి, ఇతర సైనిక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారంతా దేశం కోసం అత్యంత అంకితభావంతో సేవలు అందించారని కీర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
భారత మొట్టమొదటి సీడీఎస్ గా జనరల్ రావత్ సైన్యంలో సంస్కరణలు తీసుకువచ్చారని వెల్లడించారు. సాయుధ బలగాలు ఎదుర్కొంటున్న భిన్న సమస్యలను ఆయన పరిష్కరించడంలో కృషి చేశారని కొనియాడారు. సైన్యంలో విశేష సేవలందించి సుసంపన్నమైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. జాతికి ఆయన అందించిన సేవలను దేశం ఎప్పుడూ మర్చిపోదని మోదీ స్పష్టం చేశారు.
అటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బిపిన్ రావత్ దుర్మరణం చెందారన్న సమాచారంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. రావత్ కన్నుమూత పట్ల అమిత్ షా ప్రగాఢ సంతాపం వ్యక్తపరిచారు.