తెలంగాణలోనూ ఫోన్ ట్యాపింగ్ - కోదండరాం
తెరాస సర్కార్‌పై తెజస అధ్యక్షుడు కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ మంటలు చేలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. విపక్షాలు ఇప్పటికే తమ ఫోన్లను కేసీఆర్ సర్కార్ ట్యాప్ చేస్తోందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోదండరాం తాజాగా చేయడం రాజకీయ ప్రాధాన్యం సంతరిం చుకుంది. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల కోసం పని చేసే మానవ హక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్ట్‌లపై పెగాసస్‌ను వాడుతూ గోప్యతా హక్కును హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ జాబితాలో తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ హరగోపాల్ పేరు ఉన్నట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో కోదండరాం ఆరోపణలు రాజకీయ నేతలు, హక్కుల కార్యకర్తల్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఫోన్‌లలో మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు దేశ వ్యాప్తంగా నెలకున్నాయి. ఆ భయం, అనుమానం ఇప్పుడు తెలంగాణలో కూడా బలంగా ఉన్నాయనేందుకు కోదండరాం ఆరోపణలే నిదర్శనం.