సుబ్బారెడ్డికి కాలేయదానం చేసిన భార్య ముంతాజ్!
తీవ్రమైన కాలేయసమస్యతో బాధపడుతున్న వ్యక్తికి విజయవంతంగా భార్య కాలేయభాగాన్ని అమర్చిన లక్డీకాపుల్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు
డెక్కన్ న్యూస్, హెల్త్ బ్యూరో:
గత కొన్ని నెలలుగా తీవ్రమైన కాలేయ సమస్యతో బాధపడుతూ.. దాదాపు ప్రాణాంతక పరిస్థితికి చేరుకున్న వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు అతడి భార్య ముంతాజ్ తన కాలేయభాగాన్ని దానం చేశారు. భారతీయ సమాజంలో మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటనలో.. ముంతాజ్ అనే ముస్లిం మహిళ కుటుంబసభ్యులు ఆమె హిందూ భర్త వెంకట సుబ్బారెడ్డి ప్రాణాలు కాపాడేందుకు ఉదారంగా ముందుకొచ్చారు. సమాజంలో ఉన్న అంధవిశ్వాసాలను తోసిరాజని, ప్రేమకు భాష, కులమతాలు, సరిహద్దులు ఏమీ లేవని.. అది మనిషిలో కాక మానవత్వంలోనే పరిమళిస్తుందని మరోసారి నిరూపించారు.
రోగికి ఉన్న సమస్య, జరిగిన చికిత్స గురించి గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర బాబు మాట్లాడుతూ, “సుబ్బారెడ్డి కాలేయం బాగా పాడైంది. దాంతో అతడికి తక్షణం కాలేయమార్పిడి అవసరమైంది. అతడి అత్తింటివారంతా ముందుకొచ్చి, తమలో ఎవరి కాలేయమైనా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. తద్వారా అల్లుడి ప్రాణాలు కాపాడాలనుకున్నారు. కానీ, చూసేందుకు బాగా సన్నగా రివటలా ఉన్నా.. కేవలం ముంతాజ్ కాలేయం మాత్రమే సుబ్బారెడ్డికి సరిపోతుందని పరీక్షలలో తేలింది. దాంతో 2021 మార్చి మధ్యలో సుబ్బారెడ్డికి లక్డీకాపుల్‌లోని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో విజయవంతంగా కాలేయమార్పిడి శస్త్రచికిత్స చేశాం. అతడు పూర్తిస్థాయిలో కోలుకుని, ఇప్పుడు ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నాడు” అని తెలిపారు.
“సుబ్బారెడ్డి లాంటి రోగులకు కుటుంబం నుంచి బాగా మద్దతు అవసరం. కష్టకాలంలో అతడి కుటుంబసభ్యులంతా ఒక్కటై అతడి పక్కన నిలబడినందుకు మాకెంతో సంతోషం అనిపించింది. సరైన సమయానికి ఎంతో ప్రేమాభిమానాలతో అతడి ప్రాణాలు కాపాడేందుకు వారు ముందుకొచ్చారు. ఇప్పుడు సుబ్బారెడ్డి కొత్త, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని తన బేగంతో కలిసి పొందారు” అని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలోని లీడ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ కేఎన్ చందన్ కుమార్ చెప్పారు.
ఈ సందర్భంగా గ్లెనిగల్స్ గ్లోబల్ ఆస్పత్రి సీఈవో శ్రీ గౌరవ్ ఖురానా మాట్లాడుతూ.. ‘‘పేషెంట్‌కు ఆమె కుటుంబ సభ్యులతో పాటు, ఈ ఘనత సాధించిన ఆస్పత్రుల కన్సల్టెంట్ డాక్టర్లను అదే విధంగా సమన్వయ పరిచిన కోఆర్డినేటర్ ను ప్రశంసించారు’’.
ముంతాజ్ ఆరోగ్యం కూడా బాగుంది. ఆమె ఇంటిపనులన్నింటితో పాటు, తన భర్త ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. వంట చేసిపెట్టడం, సరైన సమయానికి మందులు ఇవ్వడం.. ఇలా ప్రతి ఒక్కపనీ ముంతాజే స్వయంగా చేస్తున్నారు. ఈ హిందూ-ముస్లిం జంటకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉంటారు. రెండు కుటుంబాలూ ఈ జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడంతో, వీరు తమ జీవితంలో కొత్త అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారు.