ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో ‘బ్రెయిన్ హెమరేజ్’ కు అరుదైన చికిత్స
కర్ణాటక నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొచ్చిన మహిళకు ప్రాణదానం
పోస్ట్ కోవిడ్ సమస్యల్లో ఈ తరహా కేసు మొదటిదని డాక్టర్ల వెల్లడి
డెక్కన్ న్యూస్, జూలై 6, 2021:
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వైద్య సేవలందిస్తున్ననగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో తలెత్తుతున్న సంక్లిష్టమైన నాడీ సమస్యల్లో ఒకటైన ‘మెదడులో రక్త స్రావం’(బ్రెయిన్ హెమరేజ్) తో బాధపడుతున్న మహిళకు అరుదైన చికిత్సనందించి ప్రాణదానం చేశారు. సాధారణంగా కొవిడ్19 బారిన పడిన వారిలో గుండె రక్తనాళాల సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్ వంటి సమస్యలు గమనించినప్పటికీ మెదడులో రక్తస్రావం కావడం కొవిడ్ బాధిత పేషెంట్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా గుర్తించలేదని, ఇది ఫస్ట్ కేసుగా నమోదైందని డాక్టర్లు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం పట్టణానికి చెందిన శ్రీమతి ఎం. ఇంద్రాణి (48) శరీరంలోని ఎడమవైపు భాగం పక్షవాతానికి గురైంది. ప్రాణాపాయ స్థితిలో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు జూన్ 11 న ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రికి రావడానికి పేషెంట్ ఇంద్రాణి ఓమ్ బెల్గాంలో కొవిడ్ 19 తగ్గిన అనంతరం స్వల్ప న్యుమోనియా లక్షణాలు ఉండటంతో చికిత్స తీసుకుంది. ఈ నాడీ సంబంధిత సమస్య కూడా కరోనా వైరస్ సంక్రమణ ప్రభావం వల్లనే కావచ్చు అనే అనుమానంతో ఎస్ఎల్ జీ వైద్య బృందం పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం చికిత్సను ప్రారంభించింది.
ఈ సందర్భంగా పేషెంట్ లో గుర్తించిన సమస్యలు, చికిత్స నందించిన తీరును ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అభినయ్ హుచ్చే వివరించారు. ఆయన మాటల్లోనే “ పలు పరీక్షల అనంతరం పేషెంట్ ఎం. ఇంద్రాణి మెదడు కుడి భాగంలో 3×4 సెం.మీ. పరిమాణంలో ఉన్న ట్యూమర్ కనిపించింది. దాంతో ఆమె ఎడమవైపు తీవ్రమైన తలనొప్పి మొద్దుబారినట్లు ఉన్నట్లు తెలిపింది. కరోనా సోకిన సమయంలో పేషెంట్ రక్తం పలచబడటం, దాంతో పాటు క్రమంగా హెవీ బ్లడ్ ప్రెషర్ (అధిక రక్తపోటు) తో నాడీ సంబంధిత సమస్యలు పెరిగి బ్రెయిన్లో రక్తం స్రావం జరిగింది. దాంతో క్రమంగా బ్రెయిన్ వాపు వస్తుండడం గమనించి వెంటనే బాధితురాలికి చికిత్స ప్రారంభించాం. నిర్ధిష్ట స్థాయిలకు మించి పెరుగుతూ ప్రమాదకరంగా పరిణమిస్తున్న బ్లడ్ ప్రెషర్‌ను అదుపులోకి తెచ్చాం. అనంతరం డాక్టర్ల పర్యవేక్షణలో పేషెంట్‌ను పరిశీలిస్తూ.. క్రమంగా చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాం.” అని వివరించారు.
“చాలా మంది మధ్య వయస్కులతో పాటు యువతీ యువకుల్లో కరోనా అనంతర సమస్యలతో పాటు డయాబెటిస్ మరియు రక్తపోటు వంటి సమస్యలు విపరీతంగా తలెత్తతున్నాయి. ముఖ్యంగా ఈ సమస్యలు శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతూ నిర్లక్ష్యం చేస్తే క్రమంగా పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. షుగర్, బీపీ స్థాయిలు నిత్యం అదుపులో ఉంచుకోవడమనేది ఎంతో ముఖ్యం. ఈ తీవ్రమైన సమస్యలను నివారించడానికి సరైన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ అభినయ్ హుచ్చే అన్నారు.
ఇంద్రాణిని ఏడు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం జూన్ 18 న ఆమె తన దినచర్యలను చేసుకునే స్థితికి చేరడంతో డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రపంచాన్నే కుదిపేస్తున్న కరోనా సంక్షోభంలో ఆందోళన, ఒత్తిడి, విచారం కలగడం చాలా సహజం. సాధ్యమైనంత వరకు నరాలపై ప్రభావం చూపే ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. దానికి ముఖ్యంగా ప్రత్యేక ఆహారపు అలవాట్లు, స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవడంతో కరోనా సమస్యలను నియంత్రించవచ్చని డాక్టర్ అభినయ్ హుచ్చే సూచించారు.