ప్రధాని మోడీ టీంలో 28 మంది కొత్తమంత్రులు.
త్వరలోనే ప్రధానమంత్రి టీంలో మరో 28 మంది మంత్రులుగా చేరనున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మరో వారంలోనే కేబినెట్ను విస్తరించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే.. గతంలో మంత్రులుగా తన కేబినెట్లోనే పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న ఒకరిద్దరికి కూడా ఈ దఫా ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. పైగా కేంద్రంలో సర్కారు ఏర్పడిన రెండేళ్ల తర్వాత.. దాదాపు 28 మందితో మంత్రి వర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూపీకి పెద్ద పీట?
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు మోడీ పెద్ద పీట వేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ రాష్ట్రానికి చెందిన వారిని ఎక్కువ సంఖ్యలో కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం హల్ చల్ అవుతున్న పేర్లలో.. అప్నా దల్ నుంచి అనుప్రియా పటేల్ కాకుండా ఫిలిబిత్ ఎంపీ మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ రామ్ శంకర్ కథారియా అనిల్ జైన్ రీటా బహుగుణ జోషి జాఫర్ ఇస్లాంలకు కూడా కేంద్రమంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలున్నాయి. అదేవిధంగా బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ మహారాష్ట్ర నేత నారాయణ్ రాణే భూపేంద్ర యాదవ్ ఎల్జేపీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ లకు కూడా కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక నుంచి కూడా..
అదేవిధంగా ఉత్తరాఖండ్ నుంచి అజయ్ భట్ అనిల్ బలూనీ కర్ణాటక నుంచి ప్రతాప్ సింహాకు చోటు దక్కే అవకాశం ఉంది. హర్యానా నుంచి బ్రిజేంద్ర సింగ్ మహారాష్ట్ర నుంచి పూనమ్ మహాజన్ లేదా ప్రీతమ్ ముండేలకు ఢిల్లీ నుంచి పర్వేశ్ వర్మ లేదా మీనాక్షి లేఖిలకు కేంద్రమంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలున్నాయి.
విధేయతకు వీరతాడు!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈయన బీజేపీలో విధేయుడిగా ఇటీవల పేరు తెచ్చుకున్నారు. దీంతో ఈయనకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో మోడీ కేబినెట్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకుని.. తర్వాత అసోం సీఎంగా వెళ్లిన శర్బానంద సోనోవాల్ కు కూడా ఈ దఫా కేబినెట్లో చోటు దక్కనుంది. ఈయనకు కూడా మోడీ విధేయుడిగా మంచి పేరు ఉండడం గమనార్హం.
మొత్తం 81 మందికి అవకాశం
కేంద్రమంత్రివర్గంలో కనీసం 81 మందికి అవకాశం ఉంది. ప్రస్తుం 53 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. దీంతో కొత్తగా 28 మందిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునేందుకు వెసులుబాటు ఉందని జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు కేంద్రమంత్రులు నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలను కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది. అయితే.. అంతా యువతకే కొత్తగా ఛాన్స్ ఇస్తారని.. మోడీ విధానాలను గట్టిగా సమర్ధించేవారికి గుర్తింపు ఉంటుందని ప్రచారం జరుగుతుండడం గమనార్హం.