అస్కార్‌లో విద్యాబాల‌న్

ఎలాంటి పాత్రకైనా తన నటనతో ప్రత్యేకతను తీసుకొస్తుంది విద్యా బాలన్. అందుకే ఇండియన్‌‌ సినీ ఇండస్ట్రీలో ఆమె స్థానం ప్రత్యేకం. ఇప్పుడామె ఖ్యాతి హాలీవుడ్‌‌ వరకు వెళ్లింది. ఆస్కార్‌‌‌‌ అకాడెమీ నుంచి ఓ అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అవార్డ్ అంటేనే ప్రత్యేకం. జీవితంలో ఒక్కసారైనా దాన్ని అందుకోవాలని ఆశ పడనివాళ్లు ఉండరు. అలాంటి ఆస్కార్ అకాడెమీ రీసెంట్‌‌గా రిలీజ్ చేసిన సభ్యుల జాబితాలో విద్యకు చోటు దక్కింది. మొత్తం యాభై దేశాలకు చెందిన 395 మంది సభ్యులతో ‘ద క్లాస్ ఆఫ్ 2021’ పేరుతో రిలీజ్ చేసిన ఈ లిస్టులో నలభయ్యారు శాతం మంది మహిళలు ఉండటం విశేషం. అలాగే మొత్తం సభ్యుల్లో ఎనభై తొమ్మిది మంది మాజీ ఆస్కార్ నామినీలు, పాతిక మంది ఆస్కార్ విన్నర్స్ కూడా ఉన్నారు. మన దేశం నుంచి ఈ లిస్టులో చోటు సంపాదించిన ఏకైక యాక్టర్ విద్య. ఆమెతో పాటు ప్రొడ్యూసర్స్‌‌ ఏక్తా కపూర్, శోభా కపూర్‌‌‌‌ కూడా మెంబర్స్​గా సెలెక్ట్ అయ్యారు. తుమ్హారీ సులు, కహానీ చిత్రాల్లో అద్భుతంగా నటించిన విద్య గురించి ప్రత్యేకంగా పొగిడింది అకాడెమీ. ఇంతవరకు తన నటనను చూసి అందరూ గర్వపడేలా చేసిన విద్య.. ఇప్పుడీ ఘనత సాధించి మరోసారి తానేంటో ప్రూవ్ చేసిందంటూ బాలీవుడ్‌‌ వాళ్లు సంబర పడుతున్నారు.