ఢిల్లీలో ధ‌ర్నా చేయ‌డానికి కేసీఆర్ ప్లాన్‌

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ కు ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందని పేర్కొన్న కేసీఆర్.. వాటిని అడ్డుకొని తీరుతామని చెప్పటంతో పాటు.. దివంగత మహానేత వైఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే.. ఈ ఏడాది మొదట్లోనే రాయలసీమ ప్రాజెక్టుకు జీవోను ఏపీ సర్కారు జారీ చేస్తే.. జూన్ మధ్యలోనే కేసీఆర్ ఎందుకీ విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు? అన్న ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పట్లేదు.
కొత్త ప్రాజెక్టులతో ఏపీ జలచౌర్యానికి పాల్పడుతున్నట్లుగా ఆరోపిస్తున్న కేసీఆర్.. ఏపీ అభ్యంతరాల్ని పట్టించుకోకుండా శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్న వైనం షాకింగ్ గా మారింది. పెద్ద ఎత్తున చేస్తున్న విద్యుదుత్పత్తి నేపథ్యంలో దిగువకు నీరు భారీగా వెళ్లిపోతున్నాయి. అవన్నీ సముద్రంలో కలిసిపోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండని పరిస్థితి. ఇదే అంశాన్ని ఎన్నిసార్లు ఏపీ ప్రభుత్వం ప్రస్తావిస్తున్నా.. దానికి మాత్రం సూటి సమాధానం ఇవ్వట్లేదు తెలంగాణ ప్రభుత్వం.
విద్యుదుత్పత్తి ఎపిసోడ్ తో ఆత్మరక్షణలో పడిన తెలంగాణ ప్రభుత్వం.. తన ఫోకస్ మొత్తం రాయలసీమ ప్రాజెక్టుపైనే పెట్టటం కనిపిస్తోంది. కొద్ది నెలల్లో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికల్ని ప్రత్యేక వాతావరణంలోజరిగేలా చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతారు. ఇందులో భాగంగానే ఈ వివాదాన్ని తెర మీదకు తెచ్చారన్న మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో తాను టేకప్ చేసిన ఇష్యూను మరింత పెద్దది చేసే పనిలో భాగంగా త్వరలోనే ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రుల్ని కలవటం.. ఏపీ మీద కేంద్రానికి కంప్లైంట్లు ఇవ్వటం ద్వారా.. తెలంగాణ ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం వాటిల్లినా ఊరుకోనన్న సంకేతాల్ని ఇవ్వటమే కేసీఆర్ లక్ష్యమని చెబుతున్నారు.
అయితే.. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రుల్ని కలవటానికే పరిమితమవుతారా? ఆయన నోటి నుంచి తరచూ వినిపించే.. ధర్నాకు కూడా దిగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మైలేజీ విషయానికే ప్రాధాన్యతను ఇస్తే.. కేంద్రమంత్రుల్ని కలవటం.. ఆ వెంటనే ధర్నాకు దిగటం లాంటివి చేయటం ద్వారా అటు ఏపీ పైనా.. ఇటు కేంద్రం పైనా ఒత్తిడిని మరింత పెంచాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఒకవేళ వినతిపత్రాన్ని కేంద్రమంత్రులకు ఇస్తే.. చూస్తామని మాత్రమే చెబుతారు. అదే ధర్నా చేస్తే.. దానికి వచ్చే మైలేజీ లెక్కలే వేరుంటాయని.. తెలంగాణ సమాజానికి తన కమిట్ మెంట్ తెలిసేలా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ధర్నా కానీ చేస్తే.. దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. అయితే.. ధర్నా కార్యక్రమానికి ఉన్న ఇబ్బందులు.. చిక్కులు ఏమిటన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కీలక ప్రకటన త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.