సీఎం రాజీనామా ?

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో శుక్రవారం భేటీ అయిన తీరత్‌ సింగ్‌ తన రాజీనామా లేఖను సమర్పించారు. శనివారం ఉదయం ఆయన గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా ఉండేందుకే తీరత్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే తీరత్‌ సింగ్‌ రాజీనామాకు సిద్ధం కావడం గమనార్హం.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా తీరత్‌ సింగ్‌ రావత్‌ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆరు నెలల్లోపే ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగు నెలలు పూర్తికాగా.. సెప్టెంబర్‌ 10 నాటికి ఆరు నెలలు అవుతుంది. అయితే, రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉద్ధృతి కారణంగా ఉప ఎన్నికలు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గడువు ముగిసేవరకు ఇలాగే పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే రాజీనామా చేయడమే ఉత్తమ మార్గమని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో సొంత పార్టీ నుంచే తీరత్‌ సింగ్‌ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా భిన్న కారణాల నేపథ్యంలో తీరత్‌ సింగ్‌ గత మూడు రోజులుగా దిల్లీలోనే మకాం వేశారు. పలుసార్లు భాజపా పెద్దలతో భేటీ అయిన అనంతరం రాజీనామాకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీరత్‌ సింగ్‌ రావత్‌ గర్వాల్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇక ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా భాజపా ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. అందులో భాగంగానే తీరత్‌ సింగ్‌ రావత్‌తో రాజీనామా చేయించి, సిట్టింగ్‌ అభ్యర్థికి సీఎం పగ్గాలు అప్పజెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.