పిపిఎం రోడ్ల నిర్మాణ పురోగతిపై జీహెచ్ఎంసి కమిషనర్ సమీక్ష
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రివెంటీవ్ పీరియాడికల్ మెయింటనెన్స్ (పి.పి.ఎం) పథకంలో భాగంగా రూ. 251 కోట్ల వ్యయంతో 802 లేన్ కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను చేపట్టగా ఇప్పటి వరకు 503.39 లేన్ కిలోమీటర్ల బిటిరోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. నగరంలో పిపిఎం రోడ్ల నిర్మాణ పురోగతిపై నిర్వాహణ విభాగం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొత్తం 802.26 లేన్ కిలోమీటర్ల బిటిరోడ్ల నిర్మాణాలకుగాను 503.39 లేన్‌కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం 62.74శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. వీటిలో రూ. 173కోట్ల విలువైన పనులు పూర్తికాగా రూ. 110 కోట్లను చెల్లించడం జరిగిందని తెలిపారు. మిగిలిన రూ. 63కోట్లను త్వరలోనే చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఈ పనుల్లో 62.74 శాతం పనులు పూర్తికాగా 68.95శాతం నిధులను సంబంధిత కాంట్రాక్టర్లకు చెల్లించామని తెలిపారు. మిగిలిన పిపిఎం పనులన్నింటిని వర్షాల ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని ఇంజనీర్లను ఆదేశించారు