మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి
తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై పొరుగు రాష్ట్రం నేతలు ఘాటగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రావారిని కించపరస్తూ మాట్లాడడం సరికాదని అంటున్నారు. ఎంత మంత్రి ఐతే మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతారా అని ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇరురాష్ట్రాల నడుమ తీవ్ర దుమారం రేపుతున్నాయి. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే.. ఆంధ్రా వాళ్లంతా తెలంగాణ వ్యతిరేకులే అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు ప్రశాంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. అందుకు మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అందులోనూ దివంగత సీఎం వైఎస్‌ను తెలంగాణ వ్యతిరేకిగా.. చావులకు కారణమైన రాక్షసుడిగా అభివర్ణించడం అలజడి రేపింది.
తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నేత, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని.. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే అన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్యలు ఉంటే ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని.. తిట్టుకుంటే నీళ్లు రావని నారాయణ అన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా రాత్రిళ్లు కలుసుకుంటారని.. కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పగలు కూర్చుని మాట్లాడుకోరంటూ సెటైర్లు వేశారు. ఆంధ్రోళ్లపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలను హుజూర్ నగర్ ఉప ఎన్నికల స్టంట్‌గా నారాయణ అభివర్ణించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ ఆంధ్రావాళ్లను తిట్టడం మొదలుపెడతాడని.. ఎన్నికల్లో గెలిచేందుకు వేసే ఎత్తుగడ అని ఆయన అన్నారు.