కన్నతండ్రి దాష్టీకం

పశ్చిమగోదావరి, పోడూరు: పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కర్కశంగా మారి ఆరేళ్ల కూతురికి వాతలు పెట్టిన ఘటన పోడూరు మండలం అప్పన్నచెరువులో చోటు చేసుకుంది. బాలిక అమ్మమ్మ పిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అప్పన్నచెరువుకు చెందిన కుసుమె ఆసిక(6)మట్టి తింటోందని తండ్రి కుసుమె కల్యాణ్‌ ఆ బాలికకు కాల్చి వాతలు పెట్టాడు. కన్న కూతురన్న కనికరం కూడా లేకుండా బాలిక ముఖంపై , కాలి తొడపై వాతలు పెట్టాడు. దీంతో ఆ బాలికకు ముఖం, తొడపై బొబ్బలొచ్చి గాయాలయ్యాయి. కల్యాణ్‌ కొన్నేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన జ్ఞానకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు.

వీరికి ఇద్దరు కుమార్తెలు ఆసిక(6), ఆదర్శ(4), కుమారుడు అహరోను(3) సంతానం. కల్యాణ్‌ భార్య ఉపాధి నిమిత్తం 3 నెలల కిందట గల్ఫ్‌ దేశానికి వెళ్లింది. కల్యాణ్‌ మద్యానికి బానిసై ఇంటివద్దే ఖాళీగా ఉంటున్నాడు. తల్లి గల్ఫ్‌ వెళ్లడంతో పిల్లలు అమ్మమ్మ కొల్లి రత్నకుమారి ఇంటివద్దే ఉంటుంటారు. కాగా ఆసిక మట్టితినడంతో పాటు అల్లరి చేస్తోందని ఈ నెల 11వ తేదీన రాత్రి కల్యాణ్‌ తన ముగ్గురు పిల్లలను అమ్మమ్మ ఇంటి నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తరువాత పెద్దకుమార్తె ఆసికకు కాల్చి వాతలు పెట్టాడు. ఆసిక మరుసటి రోజు ఉదయం అమ్మమ్మ ఇంటికి వచ్చి ఏడుస్తూ విషయం చెప్పేవరకు వారికి కూడా ఈ విషయం తెలియలేదు. అప్పటికే కల్యాణ్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఆసిక అమ్మమ్మ రత్నకుమారి పోడూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం పిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై బి.సురేంద్రకుమార్‌ కేసు నమోదు చేసి బాలిక తండ్రి కల్యాణ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడు కల్యాణ్‌కు కోర్టు14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్సై సురేంద్రకుమార్‌ తెలిపారు.