ప్రతి మనిషి ఒక అబద్దం !
ఔను నేనూ చూస్తున్న వాళ్లంతా అబద్దం నాతో సహా. ఇది మాత్రం నిజం.
నేటి కాలంలో మనిషి పుట్టడం నిజం. చావడం నిజం. మధ్యలో అంత అబద్దం.
ప్రతి మనిషి బ్రతకడానికి మాత్రమే ఆరాటపడ్తున్నాడు, జీవించాలని అనుకోవట్లేదు. ఎంతో మందికి బ్రతుక్కి -జీవించడానికి మధ్య ఉన్న బేధం కూడా తెలీదు. రెండు ఒకటే అనే భ్రమలోనే బ్రతికేస్తున్నారు.
కొంత మంది ఉన్నారు వాళ్ళకి అన్నీ తెలుసు. బతుకీడ్చడం అంటే ఏంటో? జీవించడమంటే ఏంటో? ఐనా వాళ్ళు జీవించరు. వాళ్ళు కూడా బతుకీడుస్తుంటారు అంతే.
కారణం తల్లి తండ్రులు. పిల్లలు. కుటుంబం. సమాజం.
వాళ్ళ జీవితంలో వాళ్ళ కోసం కాకుండా మిగితా అందరి కోసం ఆలోచించడం, కాదు actually భయపడటం, బయపడ్తూ బతుకుని ఎడ్ల బండికి సన్నని దారం కట్టి లాగినట్టు లాగుతూ పోవడం ఐనా వాళ్ళని ఒక అనుమానం ఎప్పటికి వెంటాడుతూనే ఉంటుంది, ఇంత సన్నని దారం, ప్రాణమే లేని దారాన్ని కట్టి, ఎంత శాయశక్తుల బలాన్ని చూపిస్తే మాత్రం ఎన్నాళ్ళు ఈ దారం ఈ బండిని నడపగలదు? ఎదో ఒక రోజు తెగిపోతుంది కదా అని అనుమానం , భయం రెండు ఉంటాయి. అయినా బండిని లాగాలి. దాన్ని లాగి లాగి ఆ మనిషి అలిసిపోయిన సరే, విసిగిపోయిన సరే, సత్తువంతా కన్నీటి చెమటగా కరిగిపోయి, దేహం లోపలి బొక్కలు మాంసపు ముద్దమీద ఎండి పోయి పైకి తేలినా, ఆ బండిని లాగాలి. ఎందుకంటే కారణాలు అవే, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబం, సమాజం.
తల్లిదండ్రులు ఒక వయసొచ్చాక వాళ్ళు మన జీవితంలో కేవలం ఒక అతిథులుగా మిగిలిపోతారు ( కొందరికి గుచ్చుకున్న ఇదే నిజం ), పిల్లలు వాళ్ళ వయసొచ్చాక వాళ్ళకంటూ ఉన్న జీవితంలో busy ఐపోతారు. కుటుంబంలో ఎవరికి సంబందించిన సమస్యలు వాళ్ళకంటూ ఉంటాయి. సమాజం ఈరోజు నిన్ను ఆకాశానికెత్తేసి తెల్లారితె నువ్వెవరు కూడా తెలీదంటుంది. అలాంటి వాటన్నింటి కోసం, ఉన్న ఒక్క జీవితం, ఒకే ఒక్క జీవితం, ఒకసారి ఛస్తే మళ్ళీ తిరిగిరాని జీవితంలో మన కోసం కాకుండా, మన జీవితంలో భాగమైన వాటి కోణం లో మనమే వెళ్ళి, మన ఇష్టాలకి, ఆశలకి, కలలకి అన్నింటికీ వ్యతిరేకంగా మనమే ఊహించుకోని బయపడి బతుకీడుస్తూ, ఈడుస్తూ అలాగే చస్తాం.
నువ్వు పోయవన్న బాధలో రెండు రోజులేడ్చి , ఓ సంవత్సరానికొకసారైనా నిన్ను తల్చుకుంటారో లేదో ( తల్చుకున్న, తల్చుకోకపోయిన ఒరిగేదేం ఉంది ) తెలీని వాళ్ళ కట్టుబాట్లకి బయపడి ప్రతి రోజు చస్తూ బతకడం.
నా తల్లి తండ్రులని కష్టపెట్టలేను, వాళ్ళని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అంటారేమో. నీకోసం నీకేం కావాలో తెల్సి కూడా చేసుకోలేని పిరికి దానివి /వాడివి వేరే వాళ్ళ సంతోషం గురించి ఆలోచించే అర్హతే లేదు నీకు. ఒకవేళ నీకేం కావాలో ఎలా సంతోషంగా ఉంటావో చెప్పాక కూడ నిన్ను నీ తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబం, సమాజం అర్థం చేసుకోలేదు అంటే truly they don’t deserve you.
ఎవరి జీవితం వాళ్ళ సొంతం. ఏ ఒక్కరికి ఇంకొకరిని శాసించే, కట్టడి చేసే అధికారం లేదు.
తల్లిదండ్రుల, తోబుట్టువుల, బంధువుల ప్రేమ అది అని చెప్పి మోస పుచ్చాల్సిన అవసరం లేదు. చేస్తే తప్పు చేస్తారేమో, చేయని, తప్పు చేసిన వాడే కదా తెలుసుకుంటాడు. So తప్పు చేసి తెల్సుకొని, ఏది మంచో ఏది చెడో నీకు తోచింది చెప్పు మిగితాది వాళ్ళకే వదిలేయ్ ఆంక్షలు విధించాల్సిన అవసరం, కట్టడి చేయాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వాళ్ళని బతకనిద్దాం, వాళ్ళ జీవితాల్ని వాళ్ళే జీవించేలా చేద్దాం.
ఎవరేమనుకుంటారు అంటూ ఎదుటువాళ్ళకోసం ఆలోచిస్తూ, సమాజానికి బయపడ్తూ బ్రతకడం అంటే కట్టెలో కాలిపోనీ శవంగా మిగిలి ఉండటమే.
ఉన్నదే ఒక్క జీవితం మీకోసం బతకండి, మీ ఆశల కోసం, సంతోషం కోసం బతుకుతు జీవితాన్ని జీవించండి.
లేదంటే బతుకీడుస్తూ ఈడుస్తూ ఎపుడో చచ్చిన ఆ శవం, ఎపుడు కుళ్లిపోయిందో కూడా తెలీకుండా పోతుంది.
అనూష శ్రీ…