కేసీఆర్ మెడకు ఈటల భూ వ్యవహారం – ఎంపీ రేవంత్ రెడ్డి
మంత్రిగా ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసి… దేవరయంజాల్ లో ఉన్న దేవాదాయ భూముల అక్రమాలు చేశాడన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ లతో కమిటీ వేసింది. అయితే,
ఆ ఊర్లో ఉన్న ఇతర దేవాదాయ భూములను మంత్రి కేటీఆర్, కేసీఆర్ బంధువులు, మంత్రి మల్లారెడ్డి కూడా అక్రమాలు చేశారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆధారాలతో సహ బయటపెట్టారు.
శామీర్ పేట మండలం, దేవరయంజాల్ గ్రామ పరిధిలోని సర్వే నెం.437,438లో కేటీఆర్, నమస్తే తెలంగాణ పబ్లికేషన్స్, కేసీఆర్ బంధువుల పేరిట ఉన్న భూమి వివరాలను రేవంత్ రెడ్డి మీడియాకు విడుదల చేశారు. మొత్తం 1531ఎకరాల భూమిని 1925 సంవత్సరం నుండి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై సంపూర్ణ విచారణ జరగాలని… ఇందులో సీబీఐ విచారణ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీగా నేనే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు.
రేవంత్ రెడ్డి ఇచ్చిన కేటీఆర్, బంధువుల భూముల వివరాలు
సర్వే నెం. 437లో 2ఎ-08 గుంటల భూమి (నమస్తే తెలంగాణ డైరెక్టర్, దివికొండ దామోదర్‌రావు)
సర్వే నెం. 437లో 1 ఎకరం. (కల్వకుంట్ల తారక రామారావు )
సర్వే నెం.438 లో 1 ఎకరం.( సురభి భీమ్ రావు)
సర్వే నెం. 438లో 2 ఎకరాలు( సురభి నవీన్‌కుమార్)
సర్వే నెం. 438లో 20 గుంటలు( సురభి జయ శ్రీ)
ఈ భూములను తాకట్టు పెట్టి నమస్తే తెలంగాణ పబ్లికేషన్స్ బ్యాంకుల్లో కోట్లల్లో రుణం పొందినట్లు రేవంత్ ఆరోపించారు.
దేవరయంజల్ దేవదాయ భూముల్లోనే నమస్తే తెలంగాణ ప్రింట్ అవుతుందని, ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నమస్తే తెలంగాణ భూముల వివరాలను బయట పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియమించిన ఐఎఏస్ కమిటీ ముందు నమస్తే తెలంగాణ సంగతి తేల్చాలన్నారు. ఆ ఊరు దేవాదాయ భూముల వివరాలను ఆన్ లైన్ లో ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ధరణిని అడ్డుపెట్టుకొని గోల్ మాల్ చేసిందన్నారు.