కరోనాకు బలైన యోధులను స్మరించుకున్న కిమ్స్ హాస్పిటల్స్
కరోనాకు బలైన యోధులను స్మరించుకోవడం మన బాధ్యత : కిమ్స్ ఎండీ భాస్కర్‌రావు
కిమ్స్ ఆస్పత్రులలో కోవిడ్-19 ప్రథమ సంస్మరణ దినం సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ
కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో ముందువరుసలో నిలిచి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు, ఆరోగ్యసిబ్బందికి, దేశంలోనే ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) ఆస్పత్రులలో మంగళవారం ఘన నివాళులర్పించారు. కోవిడ్-19 ప్రథమ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరుల సేవలను స్మరించుకున్నారు. కిమ్స్ ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో “కోవిడ్-19 మహమ్మారిపై జరిగిన పోరాటంలో విధి నిర్వహణలో తమ జీవితాలను అర్పించిన కోవిడ్ -19 యోధులందరి జ్ఞాపకార్థం” అనే పదాలతో కూడిన పైలాన్ ను ఎండీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ -19 వైరస్‌తో జరిగిన పోరాటంలో ముందువరసలో నిలిచిన వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రుల ఎండీ భాస్కర్‌రావు మాట్లాడుతూ.. “కరోనా మహమ్మారిపై జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. కోవిడ్-19 రక్కసిపై పోరాటంలో అలుపెరగక పోరాడిన వారందరికీ కృతజ్ఞతలు. కోవిడ్ -19 మహమ్మారి కేవలం ఆస్పత్రుల చికిత్స యంత్రాల సామర్థ్యాలు, అధునాతన వైద్యసదుపాయాలను పరీక్షించడమే కాకుండా.. మనుషుల మానవత్వ బంధాలు, పరిధులను కూడా చెరిపేసింది. ఇటువంటి కనీవిని ఎరుగని సంక్షోభంలో డాక్టర్లు, నర్సింగ్ మరియు సహాయక సిబ్బంది మాత్రమే కాదు, కరోనాతో పోరాడటానికి ముందు వరుసలో నిలబడి, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులతో సహా ప్రతి ఫ్రంట్ లైన్ వారియర్ వారి నిబద్ధతను ప్రదర్శించారు. రెండో వేవ్ ప్రమాదం ఉన్నప్పటికీ, ప్రజలు మనోధైర్యం కోల్పోకపోవడమే అన్నింటికన్నా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేసుకున్నప్పటికీ సామాజిక దూరం మరియు మాస్కులు ధరించడం జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం ” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ డిసీజెస్ డైరెక్టర్
డాక్టర్ పి. రఘురామ్ మాట్లాడుతూ “మన జీవితకాలంలోనే ఊహించని సంక్షోభంలో విధినిర్వహణలో భాగంగా డాక్టర్లు, నర్సింగ్ మరియు సహాయక సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎంతో కృషి చేశారు. కరోనా మహమ్మారి బారిన పడుతున్న అనేక మంది ప్రాణాలను కాపాడటానికి వారి స్వంత ప్రాణాలను మరియు వారి కుటుంబాలను పణంగా పెట్టి తమ తనువులు చాలించారు. ఇలా వందలాది మంది కరోనా కాటుకు బలయ్యారు. కంటికి కనిపించని కరోనా వైరస్ బారిన పడి పోరాడుతున్న వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
కరోనా సంక్షోభంతో గతేడాది మార్చిలో భారతదేశం మనుగడకే సవాల్ విసిరిన కాలం. సరిగ్గా యేడాది క్రితం 2020 లో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారికి బలైన ఎందరో ప్రముఖులు, ఆత్మీయుల జ్ఞాపకాలను స్మరించుకునేందుకు మరియు భవిష్యత్‌లో ఇటువంటి ప్రాణనష్టం జరగకుండా ప్రజారోగ్య చర్యలను ప్రోత్సహించడానికి ఈ పైలాన్ గుర్తుగా ఉంటుంది.