మనం వేసే అడుగులు ఒక గుర్తుగా మిగిలిపోవాలి.
మనం చేసే పనులు ఒక గుర్తింపుగా నిలిచిపోవాలి. ప్రతి మనిషికి జీవితం ఉంటుంది. కాని, మన జీవితం ప్రపంచానికి ఒక ఉదాహరణగా ఉండిపోవాలి” అనే ఆశయంతో ఎన్నెన్నో విభిన్నమైన సేవాకార్యక్రమాలతో సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు సాయపడుతూ మహిళా దినోత్సవానికి ఒక ఆదర్శవంతమైన అర్థం చెప్పిన డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ ఆదివారంనాడు బేగంపేట లోని తమ ఇంట్లో సకల మహిళా దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించడం జరిగింది.
సమాజంలో ఒక స్థాయి వారు సన్మానాలు, సత్కారాలతో ఒక పార్టీలా నిర్వహించుకునే మహిళా దినోత్సవాన్ని గత కొన్నేళ్లుగా పేదల పండగలా నిర్వహిస్తోంది కొత్త కృష్ణవేణి శ్రీనివాస్. ఇళ్లల్లో పనిచేసుకునే మహిళలు, పారిశుధ్య కార్మికులు, రైతు మహిళలు, నిర్మాణ కూలీలు, ఆదివాసీ మహిళలు, చేనేత కార్మికులు, ఉపాధ్యాయులు, రంగస్థల కళాకారులు, ముఖ్యంగా దివ్యాంగులలో కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా “పనివారు కాదు మనవారు” అనే నినాదంతో సకల మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్.
ఈ సందర్బంగా అందరికీ తనే స్వయంగా వంటలు చేసి, ఆప్యాయంగా వడ్డించడమే కాకుండా తాను కూడా అందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అదే విధంగా మహిళలందరినీ సత్కరించి బహుమతులు అందించడం జరిగింది.
కులమతాలు, స్థాయి భేదాలకు అతీతంగా ఈ వేడుకలు ఆప్యాయభరిత వాతావరణంలో జరిగాయి.