ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మహిళలు ముందుకు సాగాలి: శచి మహేశ్వరి
- అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
- కరోనా సంక్షోభంలో సేవలందించిన ఆస్పత్రి డాక్టర్లు, వైద్య సిబ్బందికి సన్మానం
ఆత్మవిశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా మహిళలు ముందుకు సాగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణురాలు శచి మహేశ్వరి అన్నారు. సోమవారం ఎల్బీనగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి గ్లెనిగల్ గ్లోబల్స్ ఆస్పత్రి హైదరాబాద్ రీజియన్ సీవోవో డాక్టర్ మెర్విన్ లియో, సామాజిక కార్యకర్త కొత్త కృష్ణవేణి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాస నిపుణురాలు శచి మహేశ్వరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని తెలిపారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారని పేర్కొన్నారు. విద్య ద్వారానే ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొం దుతుందని దాంతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదువుకోవాలని పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు ముందుగా తమపై తాము నమ్మకం ఉంచుకున్నప్పుడే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరుచుకోవాలని లక్ష్యం లేకుంటే ఏమీ సాధించలేరని తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ వుమెన్ ఇన్ లీడర్ షిప్ అచీవింగ్ ఆన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ కరోనా ఫ్యాండమిక్
గా ఎంపిక చేసినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం సామాజిక కార్యకర్త డాక్టర్ కొత్త కృష్ణవేణి కరోనా సంక్షోభంలో విశేష సేవలందించిన అవేర్ గ్లోబల్ ఆస్పత్రి సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలో కుటుంబ సభ్యులే దూరం పాటించిన తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు , వైద్యసిబ్బంది సేవలు ఎనలేనివని అందులో ముందున్నగ్లోబల్ వైద్యసిబ్బందికి పాదాభివందనం చేస్తు న్నట్లు ఆమె తెలిపారు. స్త్రీ అంటేనే శక్తి
అని నేడు అన్ని రంగాల్లో పురుషుల కంటే కూడా స్త్రీలు ఎంతో ముందున్నట్లు తెలిపారు. “మన పుట్టుక సామాన్యమైనా మన మరణం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలన్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి మాటలు ఆదర్శంగా ఆచరణలో చూపుతూ ముందుకు సాగాలని కృష్ణవేణి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గ్లెనిగల్ గ్లోబల్స్ ఆస్పత్రి హైదరాబాద్ రీజియన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ మెర్విన్ లియో ఆస్పత్రి డాక్టర్లు, ఆరోగ్యసిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఒక మహిళ శక్తి విజయవంతమైన వందమంది పురుషులతో సమానమని తెలిపారు. వారు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా సంక్షోభంలో గ్లోబల్ ఆస్పత్రి నర్సుల సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం హాజరైన అతిథులను గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఆస్పత్రి పీడియాట్రిషన్ డాక్టర్ మార్కండేయులు, నర్సింగ్ హెడ్ ప్రమీల, శ్రీ మోమిన్ మహ్మద్ బాష, శ్రీ ప్రవీణ్, శైలజ, డాక్టర్ సూర్య ప్రకాశ్, డాక్టర్ మురళీశ్వర్, డాక్టర్ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.