సుమ న్యూరో కేర్ లో అధునాతన చికిత్సలు
మెరుగైన వైద్యసేవలందించడంలో”సుమ న్యూరో కేర్” ముందుండాలి
ఎస్ఎల్‌జి ఆస్పత్రి చైర్మన్ దండు శివరామరాజు
అధునాతన వైద్యసదుపాయాలతో, మెరుగైన వైద్యసేవలందిస్తూ సుమ న్యూరో కేర్ సెంటర్
నగర ప్రజలకు చేరువవ్వాలని ఎస్ఎల్‌జి ఆస్పత్రి, కత్రియా హోటల్స్ చైర్మన్ శ్రీ దండు శివరామరాజు గారు పేర్కొన్నారు. సోమవారం చందానగర్‌లోని గంగారంలో వీఆర్‌కె సిల్క్స్ షాపింగ్‌మాల్ కు ఎదురుగా ప్రముఖ న్యూరాలజిస్ట్ సుమ కందుకూరి నెలకొల్పిన “సుమ న్యూరోకేర్ సెంటర్”ను ఎస్ఎల్‌జి ఆస్ప్రతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ డీవీఎస్ సోమరాజు గారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ముఖ్యంగా చందానగర్ ప్రజలకు ఆధునాతన సౌకర్యాలతో న్యూరో కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గత కొన్నేళ్లుగా డాక్టర్ సుమ కందుకూరి ఉస్మానియా ఆస్పత్రి న్యూరాలజిస్ట్‌గా మంచి గుర్తింపు పొంది, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి సుపరిచితులుగా ఉన్నారని తెలిపారు. కొత్తగా సుమ న్యూరో కేర్ సెంటర్‌లో సేవలు ప్రారంభించడం శుభపరిణామమన్నారు. డాక్టర్ సుమ కందుకూరి న్యూరో, ముఖ్యంగా పిల్లల న్యూరాలజీ డాక్టర్‌గా, మూర్చ వ్యాధి గ్రస్తులకు సేవలందించే ఎపిలెప్టాలజిస్టుగా ఎన్నో సేవలందించి ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. రాబోయే రోజుల్లో చందానగర్ వాసులకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
అనంతరం డాక్టర్ సుమ కందుకూరి మాట్లాడుతూ చందానగర్ సమీప ప్రాంతాల ప్రజలకు అధునాతనమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్ధేశంతోనే ఈ సుమ న్యూరో కేర్‌సెంటర్‌ను ఏర్పాటు చేశాం. పక్షవాతం, ఫిట్స్, నరాల బలహీనత, మెదడువాపు, తలనొప్పి మొదలైన అన్ని వ్యాధులకు కూడా పెద్దలు, పిల్లలకు తేడా లేకుండా అత్యాధునిక వైద్యసదుపాయాలు అందించేలా ఏర్పాట్లు చేశాం. దీనితో పాటు న్యూరాలజీకి సంబంధించిన అన్ని రకాల టెస్టులు కూడా చేసేందుకు ఎంతో అధునాతన పరికరాలను కూడా న్యూరోకేర్ సెంటర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాం. అందుకే చందానగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం
అని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, న్యూరో కేర్ సెంటర్ డాక్టర్లు, వైద్యసహాయక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.