ఎస్ఎల్‌జి ఆస్పత్రిలో సజ్జనార్
క్యాన్సర్ నిర్మూలనకు ముందస్తు గుర్తింపు, జాగ్రత్తలు ముఖ్యం : సీసీ సజ్జనార్
- ఎస్ఎల్‌జి ఆస్పత్రిలో ఉచిత ”క్యాన్సర్ స్క్రీనింగ్” క్యాంపును ప్రారంభించిన సైబరాబాద్ సీపీ*
- ఫిబ్రవరి 12 నుంచి 28 వరకు ఉచితంగా పరీక్షలు
- క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించడానికి ముందస్తు గుర్తింపు మరియు సరైన చికిత్స ఎంతో ముఖ్యమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ అన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సిఎస్‌సి) సహకారంతో నిజాంపేటలోని ఎస్ఎల్‌జి ఆస్పత్రిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత “ క్యాన్సర్ స్క్రీనింగ్” క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ వీసీ సజ్జనార్ గారు, ఎస్ఎల్‌జి ఆస్పత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. శివరామరాజు గారు, ఎస్‌సిఎస్‌సి సెక్రటరీ జనరల్ కృష్ణ యేదుల గారు, ఎస్ఎల్‌జి ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్టు డాక్టర్ సురేంద్ర బత్తుల గారు, ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ పానిగ్రాహి గారితో కలిసి క్యాంపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ గారు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించాలన్న ఏకైక లక్ష్యంతో ఎస్ఎల్‌జి ఆస్పత్రి యాజమాన్యం, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సిఎస్‌సి)తో కలిసి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఉన్నతమైన కుటుంబాలతో పాటు బలహీన వర్గాలు అధికంగా ఉండే మన సమాజంలో ప్రతి ఒక్కరినీ భయపెట్టే పదం “క్యాన్సర్” అని సీపీ సజ్జనార్ అన్నారు. క్యాన్సర్ పేరు వింటేనే గ్రామీణ ప్రజలు వణికిపోతారన్నారు. అటువంటి పేద ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పరీక్షలు చేయాలనుకునే వారికి సహకరించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సీపీ అన్నారు. ఎస్‌సిఎస్‌సి తో కలిసి ఎస్ఎల్‌జి ఆస్పత్రి చైర్మన్ డి. శివరామరాజు గారు ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టినందుకు వారి కృషిని స్వాగతిస్తూ.. క్యాంపులో పాల్గొన్న డాక్టర్ల బృందం, సహాయక సిబ్బంది తో పాటు భాగస్వాములవుతున్న వారందరినీ సీపీ సజ్జనార్ అభినందించారు. ఈ సందర్భంగా వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీపీ తిలకించారు.
అనంతరం ఎస్ఎల్‌జి ఆస్పత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. శివరామరాజుగారు మాట్లాడుతూ.. అందరం కలిసి క్యాన్సర్ నివారణ కోసం కృషిచేద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ ఉచిత క్యాన్సర్ పరీక్షల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ లబ్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా క్యాన్సర్ పై ప్రతి మహిళా మరో మహిళకు అవగాహన కలిగించాలని శివరామరాజుగారు సూచించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే నిర్మూలించడం సులభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్ఎల్‌జి ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్టు డాక్టర్ సురేంద్ర బత్తుల గారు మాట్లాడుతూ మనదేశంలో 50శాతానికి పైగా క్యాన్సర్ కేసులు ముదిరిపోయిన తర్వాతే బయటపడుతున్నాయని, వ్యాధిబారిన పడినవారిలో 70 శాతానికి పైగా మరణిస్తున్నారని చెప్పారు. అందుకే 40 ఏండ్లు దాటిన ప్రతి మహిళ పాప్‌స్మియర్, మమోగ్రఫీ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
ఉచిత పరీక్ష కోసం..
ఫిబ్రవరి 12 నుంచి 28 వరకు ఎస్ఎల్‌జి ఆస్పత్రిలో జరిగే ఈ ఉచిత క్యాంపు కార్యక్రమంలో మహిళలు, పురుషుల్లో ఎక్కువగా వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతో పాటు ఇతర క్యాన్సర్ల కు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ముఖ్యంగా ప్రతి మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడానికి మోటివేట్ కావాలి. స్క్రీనింగ్ క్యాంప్ వద్ద స్త్రీ లకు ఉచిత మామోగ్రఫీ, పాప్ స్మెర్ టెస్ట్, అల్ట్రాసోనోగ్రఫీ మరియు స్పెషలిస్ట్ కన్సల్టేషన్లను పొందవచ్చు, పురుషులు పీఎస్ఏ టెస్ట్‌తో పాటు సంబంధిత స్పెషలిస్టులను కూడా సంప్రదించవచ్చు.
దేశంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. క్యాన్సర్ మానవులకు ప్రాణాంతకమైన వ్యాధి అని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. మరియు ఈ భయంకరమైన మహమ్మారి వ్యాప్తికి అవగాహన రహితమైన స్త్రీ ,పురుషుల తప్పిదాలే అని చెప్పవచ్చు.అయితే దేశంలో పురుషుల కంటే స్త్రీలల్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ జనాభా కూడా ఇందుకు ముఖ్య కారణం. దేశంలో క్యాన్సర్ వ్యాప్తి రేటు ప్రతి లక్ష మంది పురుషుల్లో 94 మంది ఉండగా, ప్రతి లక్ష మంది స్త్రీలలో ఇది 103 కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. పొగాకు ధూమపానం, మద్యం సేవించడం, శారీరక వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి జీవనశైలి ఈ పెరుగుదలకు కారణాలు.
ఎస్‌ఎల్‌జి హాస్పిటల్స్ గురించి
ఎస్‌ఎల్‌జి ఆస్పత్రి హైదరాబాద్ శివారులోని నిజాంపేట సమీపంలో బాచుపల్లి వద్ద అధునాతన పరికరాలతో, ఎంతటి క్లిష్టమైన చికిత్సలనైనా అందించేందుకు అవసరమైన అన్ని వైద్య మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు. 999 బెడ్స్ కెపాసిటీతో అత్యంత అధునాతనంగా ఈ ఆస్పత్రిని నిర్మించారు. అన్ని వయస్సుల వారికీ కూడా వైద్యసేవలందించేందుకు అన్ని విభాగాలు ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి.