గర్భం-గర్భాశయ క్యాన్సర్ తెలుసుకుందాం
డాక్టర్ సునీత
రేడియేషన్ ఆంకాలజిస్ట్,
అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్
గర్భవతిగా ఉండటం, బిడ్డకు జన్మనివ్వడం అంటే స్త్రీ జీవితంలో సరికొత్త అంకానికి ఆరంభం అని చెప్పాలి. తల్లికావడంతోనే జీవిత ప్రాధాన్యతలన్నీ ఇట్టే మారిపోతాయి. మాతృత్వ మధుర భావనను ఆస్వాదిస్తూ, కొత్త జీవితాన్ని సక్రమంగా నిర్వహించడానికి మహిళలు అనేక ఒడిదుడుకులకు లోనవుతారు. అటువంటి ఉద్వేగభరిత సమయంలో ఆ తల్లికి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే.. అది కూడా బిడ్డను గర్భంలో మోస్తున్న ఆ మాతృమూర్తి గర్భాశయానికి క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించబడితే.. ఒక్కసారిగా జీవితం తలక్రిందులయిపోతుంది. ఆ విషాదాన్ని వ్యక్తీకరించడానికి మాటలు సరిపోవు.
అయితే.. గర్భాశయ క్యాన్సర్ కారణంగా గర్భ విచ్ఛిత్తి జరగడమనేది చాలా అరుదు. గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల్లో 1 నుండి 3 శాతం మంది గర్భధారణ సమయంలో గానీ, ప్రసవానంతరం గానీ క్యాన్సర్ బారినపడినట్లు నిర్ధారించబడుతున్నారు. అత్యధిక శాతం మందిలో జననేంద్రియం నుండి రక్తస్రావం కావడం గర్భాశయ క్యాన్సర్ వ్యాధి యొక్క ప్రధాన లక్షణంగా తెలుస్తోంది. రక్తస్రావం కావడాన్ని గర్భస్రావంగా పొరబడం తరచుగా చూస్తున్నాం.
పై లక్షణాలతో వచ్చిన వ్యక్తికి రక్తపరీక్షలతో పాటు, బయాప్సీ, ఎక్స్-రే, సిటి స్కాన్, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ తదితర భిన్నమైన పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది. అల్ట్రాసౌండ్, ఉదరకోశ ఎంఆర్ఐ పరీక్షల ద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో నిర్ధారించడం జరుగుతుంది.
వ్యాధి దశ, గర్భం యొక్క స్థితితో పాటు, క్యాన్సర్ బారినపడిన కాబోయే మాతృమూర్తి ఆకాంక్షలకు అనుగుణంగా చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు. వ్యాధి దశను బట్టి ప్రసవం పూర్తయ్యేంత వరకు క్యాన్సర్ చికిత్సను వాయిదా వేయవచ్చు. ఒకవేళ గర్భాన్ని తొలగించినట్లయితే రోగి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి శస్త్రచికిత్స గానీ, కీమో-రేడియేషన్ చికిత్స గానీ సూచించబడుతుంది.
రోగులలో ఎక్కువమంది ప్రసవం వరకు చికిత్సను వాయిదా వేసుకుంటున్నారు. గర్భాశయ క్యాన్సర్ బారినపడ్డ గర్భవతులు సిజేరియన్ ప్రక్రియ ద్వారా ప్రసవం జరిగేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు.
గర్భధారణ సమయంలో వ్యాధిని అదుపులో ఉంచడానికి సురక్షితమైన మోతాదులో కీమోథెరపీ మందులు ఇవ్వబడతాయి. ఈ పూర్తి ప్రక్రియలో వ్యాధిని నయం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. గర్భాన్ని సరక్షించి, బిడ్డను భూమిపైకి తేవడం కోసం తల్లి ప్రాణాన్ని ఫణంగా పెట్టకూడదని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలి.