డెంగ్యూ తో పాటు లివ‌ర్ ఫెయిల్ అయ్యే ద‌శ‌లో కిమ్స్‌ లో బాలుడికి ప్రాణ‌దానం

డెక్క‌న్ న్యూస్‌: తీవ్రమైన డెంగ్యూ జ్వ‌రంతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడికి కర్నూలు కిమ్స్‌‌ ఆస్పత్రి డాక్టర్లు ప్రాణ‌దానం చేశారు. నంద్యాల కు చెందిన రెండేళ్ల బాలుడిని 5 రోజులుగా తీవ్ర‌మైన జ్వరం, 2 రోజులు వాంతుల‌తో అప‌స్మార‌స్థితిలోకి చేరిన‌ ద‌శ‌లో త‌ల్లిదండ్రులు క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. బాగా నీర‌సించి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్తున్న బాలుడికి డాక్ట‌ర్లు వెంట‌నే ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. సాధార‌ణంగా డెంగ్యూ ల‌క్ష‌ణాలు ఉంటే ఎవ‌రికైనా ర‌క్త‌నాళాల నుంచి ద్ర‌వాల‌ను కోల్పోవ‌డంతో నీర‌సించి షాక్‌కు గుర‌వుతార‌ని డాక్ట‌ర్లు తెలిపారు. రిపోర్టుల్లోనూ డెంగ్యూ జ్వరం ల‌క్ష‌ణాలు ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి చేరిన‌ట్లు, రక్తంలోని హీమోగ్లోబిన్, ప్లేట్ లెట్స్‌ తగ్గడంతో పాటు క్ర‌మంగా కాలేయ ఎంజైమ్‌లు పెరిగి, రక్తం గ‌డ్డ‌క‌ట్ట‌క పోవ‌డంతో అస్త‌వ్య‌స్తంగా మారిన‌ట్లు గుర్తించారు. దీంతో లివ‌ర్ ఫెయిల్ అయ్యే ద‌శ‌లో ఉన్న‌ట్లు గుర్తించారు.
బాలుడికి డెంగ్యూ జ్వ‌రంతో ప్రాణాల‌కే ప్ర‌మాద‌మున్న‌ట్లు, వైద్యానికి అయ్యే ఖర్చులను తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారు తమ ఆర్థిక పరిస్థితిని చెప్పుకుని విలపించారు. వారి పరిస్థితిని గమనించిన డాక్టర్లు ఆరోగ్యశ్రీ పథకం కింద బాబుకు చికిత్స అందించాలని నిర్ణయించుకుని వెంటనే పిల్లల చికిత్సకు సంబంధించిన పీఐసీయూ కు తరలించారు. పీఐసీయూలో ఎంతో విస్తృత అనుభ‌వం క‌లిగిన, యూకేలో ప‌నిచేసి వ‌చ్చిన డా. రవికిరణ్, అదే విధంగా చెన్నైలో శిక్ష‌ణ పొందిన స‌మ‌ర్థుడైన‌ డా. వాసు బుర‌లి వెంక‌న్న ఇద్ద‌రి డాక్ట‌ర్ల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎంతో సుశిక్షితులైన‌ న‌ర్సుల‌ బృందం చికిత్స ప్రారంభించారు. బీపీ పూర్తిగా త‌గ్గింది‌, ర‌క్త‌నాళాల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న బాలుడికి వెంటిలేటర్ స‌హాయంతో చికిత్స చేశారు. ర‌క్త‌నాళాలు, నాడీ వ్య‌వ‌స్థ స్పందించ‌క‌పోవ‌డంతో 5 రోజుల పాటు వెంటిలేటర్ పైనే బాలుడికి కావాల్సిన ప్లేట్‌లెట్స్, యాంటిబయెటిక్స్‌ ఎక్కిస్తూ, ప‌లు ర‌కాల ఫ్లూయిడ్స్‌ నోటిద్వారానే అందించారు. బాలుడు వేగంగా కోలుకునేందుకు ర‌క్త‌నాళాల‌కు సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ చికిత్స కొన‌సాగించారు. క్ర‌మంగా కోలుకుని పూర్తిగా ఆరోగ్యంగా మారిన త‌ర్వాత‌నే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేసిన‌ట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ సంద‌ర్భంగా డాక్టర్ బుర‌లి వాసు వెంక‌న్న మాట్లాడుతూ ఇటువంటి సంక్షిష్ట‌మైన కేసులు వస్తే హైదరాబాద్ కు పంపేవారమని కానీ ప్రస్తుతం క‌ర్నూలు కిమ్స్‌లోనే అన్ని రకాల అధునాతన వైద్య స‌దుపాయాల‌తో పాటు నిష్ణాతులైన డాక్ట‌ర్లు ఉన్నార‌ని తెలిపారు. దీంతో ఎంత సంక్షిష్ట‌మైన స‌మ‌స్య‌తో వ‌చ్చిన చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు.
మ‌రో డాక్ట‌ర్ ర‌వి కిర‌ణ్ మాట్లాడుతూ బాబుకి డెంగ్యూతో పాటు సెకండ‌రీ ఇన్ఫెక్ష‌న్ లివ‌ర్ ఫెయిల్యూర్ అయిన విష‌యాన్ని ప‌రీక్ష‌ల ద్వారా గుర్తించామ‌ని తెలిపారు. ఇలాంటి వాటిని వైద్య ప‌రిబాష‌లో మ‌ల్టీ ఆర్గాన్ డిస్ఇన్షెఫ‌క్ష‌న్ సిండ్రోమ్ అని అంటార‌ని పేర్కొన్నారు. అయితే ఇటువంటి సంఘ‌ట‌న‌లు అరుదుగా జ‌రుగుతాయ‌న్నారు.
అనంత‌రం బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా బాబును ప్రాణాలతో చూస్తామనుకోలేదు. ఆస్ప‌త్రికి తీసుకురాగానే మా బాబుపై వారు చూపిన శ్రద్ధ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంత మంచి డాక్టర్లు ఉంటారనుకోలేదు. మా ఆర్థిక పరిస్థితులను డాక్ట‌ర్ల‌కు చెప్పగానే వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా బాబుకు చికిత్స చేసి ప్రాణం పోశారు అని వివరించారు. ఇక్కడ పీఐసీయూలో పనిచేసే డాక్ట‌ర్లు, న‌ర్సులు ఎంతో మంచివార‌ని ఈ సంద‌ర్భంగా వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నామ‌న్నారు.