ఒకేసారి గుండె, ఊపిరితిత్తులు మార్చుకున్న రోగులకు కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహం
- ఇద్దరు రోగులకు ఒకేసారి గుండె, రెండు ఊపిరితిత్తులు మార్చిన కిమ్స్ వైద్యులు
- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళకు గుండె, ఢిల్లీ వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి
కొత్త సంవత్సరం వేళ ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 ఏళ్లమహిళకి , ఢిల్లీకి చెందిన 59 ఏళ్ల పురుషుడికి ఈ కొత్త సంవత్సరం చాలా కొత్తగా అనిపిస్తోంది. వాళ్లిద్దరూ కిమ్స్ ఆసుపత్రిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఈ కొత్త జీవితాన్ని పొందారు. వారిలో ఒకరికి గుండెను మార్చగా మరొకరికి రెండు ఊపిరితిత్తులను మార్చారు. ఈ రెండు ఆపరేషన్లూ ఒకేసారి జరిగి.. వారికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించాయి.
కిమ్స్ ఆసుపత్రిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ వైద్యులు కాలంతో పరుగులు పెడుతూ ఒకేసమయంలో విజయవంతంగా ఒక గుండె, రెండు ఊపిరితిత్తులను వేర్వేరు రోగులకు మార్చారు. థొరాసిక్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రాం ఛైర్, డైరెక్టర్ అయిన డాక్టర్ సందీప్ అత్తావర్, ఆయన బృందం కలిసి 2020 డిసెంబర్ 24న ఈ అద్భుతాన్ని నిజం చేశారు. నగరానికి చెందిన ఒక బ్రెయిన్ డెడ్ రోగి నుంచి అవయవాలు సేకరించి, వాటిలో గుండెను ఒకరికి, ఊపిరితిత్తులను మరొకరికి అమర్చారు.
“బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుంచి తీసిన అవయవాలను కేవలం 6-8 గంటల సమయంలోనే ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు అమర్చడం అనేది మాకు అతిపెద్ద సవాలు. అయితే, దాత.. గ్రహీతలు అంతా ఒకే ఆసుపత్రిలో ఉండటం మాకు చాలా వరకు మేలు చేసింది. దీనివల్ల ప్రయాణ సమయం మొత్తం ఆదా అయ్యింది. అయితే అదే సమయంలో రెండు సర్జికల్ బృందాల మధ్య సమన్వయం సాధిస్తూ ఒకే సమయంలో ఇద్దరికీ ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది” అని థొరాసిక్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రాం ఛైర్, డైరెక్టర్ అయిన డాక్టర్ సందీప్ అత్తావర్ తెలిపారు.
ఢిల్లీకి చెందిన 59 ఏళ్ల కొవిడ్ సోకినా పురుషుడికి, ఆ తర్వాత ఊపిరితిత్తులు తంతీకరణకు గురయ్యాయి. దాంతో అతడికి ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు. గత రెండు వారాలుగా ఈ చికిత్స కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 ఏళ్ల మహిళకి మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ కారణంగా తీవ్రమైన గుండె సమస్య ఏర్పడింది. దాంతో ఆమెకు గుండె మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది.
“ఈ రెండు ఆపరేషన్లూ విజయవంతం అయ్యాయి. అవయవ గ్రహీతలు ఇద్దరూ ఐసీయూలో కోలుకుంటున్నారు. కిమ్స్ హార్ట్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం చరిత్రలో ఇది మరో మైలురాయి” అని డాక్టర్ సందీప్ అత్తావర్ తెలిపారు.
“మా అమ్మకు గుండె సమస్య తీవ్రంగా ఉందనడంతో మేం తీవ్ర నిరాశకు గురయ్యాం. ఆమెకు గుండె మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదన్నారు. దాంతో ఏంచేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కిమ్స్ ఆసుపత్రికి వచ్చాం. ఇక్కడ డాక్టర్ సందీప్ అత్తావర్ నేతృత్వంలోని వైద్యబృందం అద్భుతంగా కృషిచేసి, ఆపరేషన్ విజయవంతం చేశారు. ఫిజిషియన్ డాక్టర్ సోనాలి అరోరా నిరంతరం మాకు మా అమ్మ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ కౌన్సెలింగ్ చేశారు. తెలంగాణ జీవన్‌దాన్ బృందం సహకారం లేనిదే అసలు మా అమ్మకు గుండె దొరికేదే కాదు. వారి కృషి కూడా ఎంతో అద్భుతం. కొండంత కష్టాన్ని గొంతులోనే దిగమింగుకుని.. తమవాళ్ల అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చిన అవయవదాత కుటుంబానికి మేం ఎంత చెప్పినా, ఏం చేసినా తక్కువే” అని మహిళ పేషెంట్ కుమారుడు మణి వైభవ్ తన కృతజ్ఞతలు తెలిపారు.
“మా నాన్నకు కొవిడ్ సోకి, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ ఏర్పడింది. దాంతో ఊపిరితిత్తులు మార్చడం తప్ప వేరే దారి లేదన్నారు. మేం దాదాపుగా ఆశలన్నీ వదిలేసుకున్న తరుణంలో కిమ్స్ ఆసుపత్రికి వచ్చాం. ఇక్కడ డాక్టర్ సందీప్ అత్తావర్ దేవుడి లాంటి చేతులతో అద్భుతం చేశారు. ఇక్కడి ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు, అన్ని విభాగాలకు చెందిన వైద్యులు ఉండటం కూడా చాలా మేలు చేసింది. రోగి ఆరోగ్య పరిస్థితి గురించి వాళ్ల బంధువులకు ఎప్పటికప్పుడు చెబుతుండటం కూడా మాకు చాల ఊరటనిచ్చింది. మేం దాదాపుగా ఆశలన్నీ వదిలేసుకున్న సమయంలో డాక్టర్ సందీప్ అత్తావర్ మాకు కొత్త ఆశలు కల్పించారు. ఆయనకు నిజంగా ఏదో అద్భుత శక్తి ఉందనిపిస్తుంది. రోగుల కుటుంబాలకు సాంత్వన కల్పించడంలో ఆయనకు సాటిలేరు. ఎవరైనా తమవాళ్లకు అవయవ మార్పిడి చేయించలేక అశక్తతతో ఉంటే.. వారికి కిమ్స్ ఆసుపత్రిని, డాక్టర్ సందీప్ అత్తావర్ బృందాన్నే నేను సూచిస్తాను” అని ఉపిరిత్తుతుల గ్రహీత కుమారుడు ప్రశంత్ ముకీమ్ చెప్పారు.
దేశంలోనే గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిపుణుల్లో అత్యంత అనుభవం కలిగిన వారిలో డాక్టర్ సందీప్ అత్తావర్ ఒకరు. ఈ రంగంలో 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ అత్తావర్ ఇంతవరకు దాదాపు 12వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు, 250కి పైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి, కృత్రిమ గుండె అమరిక (ఎల్‌వీఏడీ) లాంటి శస్త్రచికిత్సలు ఆయన చేతుల మీదుగా జరిగాయి.