ఆవేర్ గ్లోబల్ హాస్సిటల్‌లో ఆరుదైన చికిత్స
- ఉదరభాగం తొలగించి ప్రాణదానం చేసిన ఆసుపత్రి వైద్యులు
-చికిత్సకు ముందు 10 నెలల పాటు ప్రాణాల కోసం పోరాడిన మహిళ
ఖమ్మం ప్రాంతానికి చెందిన మంజుల (39) 2019 నవంబర్ నెలలో హార్పిక్ అనే టాయిలెట్ క్లీనర్ తాగేశారు. ఆమెకు అవేర్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ప్రాణదానం చేసి, సరికొత్త జీవితాన్ని అందించారు. ఆమె శరీరంలోని కడుపు భాగం నాలుగోదశ వరకు పాడైపోవడంతో ఆమె ప్రాణాలు కాపాడేందుకు దాన్ని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత ఆమె నోటి ద్వారా మళ్లీ ఆహారం తీసుకోవడం మొదలైంది.
గత సంవత్సరం నవంబర్ నెలలో ఈ ఘటన జరిగిన తర్వాత, రోగి అంతర్గత అవయవాలు బాగా పాడయ్యాయి. ఆమె పలు ఆసుపత్రులకు తిరిగినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దాంతో చివరకు అవేర్ గ్లోబల్ ఆసుపత్రికి రాగా, అక్కడ కన్సల్టెంట్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ భూపతి రాజేంద్ర ప్రసాద్ చికిత్స చేసి, ఆమెకు ఊరటనిచ్చారు. అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలోని నిపుణుల బృందం ఆరునెలలకు పైగా ఆమెకు చికిత్స చేశారు. అప్పుడు ఆమె పరిస్థితి శస్త్రచికిత్సకు అనుగుణంగా మారింది. ఈలోపు బాధితురాలికి బయట నుంచి పైపు ద్వారా ఆహారం అందించారు. అది కడుపు దిగువభాగంలోకి నేరుగా వెళ్లేది.
ఈ చికిత్స గురించి, అది విజయవంతం అయిన తీరు గురించి అవేర్ గ్లోబల్ ఆసుపత్రి కన్సల్టెంట్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ భూపతి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, “రోగి ఆహారవాహిక పూర్తిగా పాడైంది. దాంతో ఆమెను కాపాడేందుకు కడుపు తొలగించాల్సి వచ్చింది. ముందుగా ఆమె విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని ఆమె ఆరోగ్య స్థితిని మెరుగుపరిచాం. ఘటన జరిగిన 10 నెలల తర్వాత ఆమెకు శస్త్రచికిత్స చేశాం. చివరకు ఆమె కడుపు భాగం తొలగించాం, పేగులను నేరుగా శ్వాసనాళికకు కలిపి ఆహార మార్గాన్ని పూర్తిచేశాం. ఇప్పుడు రోగి పూర్తిగా కోలుకుని, నోటి ద్వారా సాధారణంగానే ఆహారం తీసుకోగలుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో అనెస్థీషియాలజిస్టు డాక్టర్ మోహన్, క్రిటికల్ కేర్ విభాగానికి చెందిన డాక్టర్ రాజేంద్ర, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ రవిశంకర్ పూర్తి సాయం అందించారు” అని వివరించారు.
“అవేర్ గ్లోబల్ ఆసుపత్రి, అందులో అత్యంత నిపుణులైన డాక్టర్ రాజేంద్రప్రసాద్ సాయం చేయడంతో మా అక్క తిరిగి కోలుకుని మామూలు మనిషైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది” అని బాధితురాలి తమ్ముడు ఎం.శ్రీనివాస్ తెలిపారు.
రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆమెను 45 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచారు. ఆమెను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తరచు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. చివరకు మంజుల పూర్తిగా కోలుకున్నారు, ఘటన జరిగిన దాదాపు ఏడాది తర్వాత సాధారణ జీవితం గడపగలరు.
ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ వివరించారు:
• యాసిడ్లు, స్పిరిట్లు, టాయిలెట్ క్లీనర్లు, ఇతర ప్రమాదకర ద్రవాలను పిల్లలకు దూరంగా ఉంచాలి. అవి పొరపాటున తాగకుండా చూడాలి.
• వ్యక్తిగతంగా గానీ, వృత్తిపరంగా గానీ మానసిక ఒత్తిడితో ఉన్న వారికి కూడా ఇవి అందకుండా దూరంగా ఉంచాలి. అలాంటివారికి వైద్యసాయం అందించాలి.
• యాసిడ్లు, స్పిరిట్లకంటే, ఇంట్లో వాడేందుకు సురక్షితమైన పరిశుభ్రతా వస్తువులు వాడితే మంచిది.