యువతి పొట్టలో పుచ్చకాయ పరిమాణంలో కణితి

  • విజయవంతంగా తొలగించిన కర్నూలు కిమ్స్ వైద్యులు
  • ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటివి 800 కేసులు మాత్రమే
  • ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స
  • ఏపీలోనే మొదటి శస్త్రచికిత్స

ఒక యువతి పొట్టలోని ప్లీహానికి సమీపంలో దాదాపు పుచ్చకాయ పరిమాణంలో ఉన్న కణితిని కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తొలగించి, ఆమెకు ప్రాణదానం చేశారు. ప్రపంచంలోనే అరుదుగా సంభవించే ఇలాంటి కణితులకు భారతదేశంలో రెండవది కాగా…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి. పైపెచ్చు, ఇదంతా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా చేయడం విశేషం. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ముల్లా గుల్జార్ (20) అనే యువతికి పుట్టుకతోనే జన్యుపరమైన కారణాల వల్ల ఈ కణితి ఏర్పడింది. అయితే గత ఆరు నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. కొందరు వైద్యులు ఆమెకు గ్యాస్ సంబంధిత సమస్యలని భావించి, అందుకు మందులు కూడా ఇచ్చారు. అయినా నొప్పి తగ్గకపోవడం, వాంతులు కూడా అవుతుండటంతో చివరకు కిమ్స్ ఆసుపత్రికి రాగా.. సీటీ స్కాన్ చేసి, ప్లీహం సమీపంలో పెద్ద కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి తొలగించడం తప్ప మరో మార్గం లేకపోవడంతో కిమ్స్ వైద్య నిపుణులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే, అది చాలా సంక్లిష్టమైనది. చాలా సంవత్సరాలుగా లోపల కణితి పెరుగుతూ ఉండటంతో అది పేగులకు కూడా కొంతవరకు అతుక్కుని ఉంది. దాంతో అత్యంత జాగ్రత్తతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

ఈ సమస్య గురించి, దాని తీవ్రత గురించి కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ వసీమ్ హసన్ రజా షేక్ ఇలా వివరించారు.. ‘‘ప్లీహం వద్ద కణితులు ఏర్పడటం చాలా అరుదు. ప్రపంచ వైద్యచరిత్రలోనే ఇప్పటివరకు కేవలం 800 కేసులు మాత్రమే ఇలాంటివి బయటపడ్డాయి. పైగా ఇంత పెద్ద కణితి ఏర్పడటం కూడా చాలా అరుదు. ప్రపంచంలోనే ఇది మూడో అతి పెద్దది. భారతదేశంలో రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద కణితి అని చెప్పుకోవచ్చు. దీని బరువు సుమారు 3.5-4 కిలోల వరకు ఉండి, పుచ్చకాయ పరిమాణంలో ఉంది. అమ్మాయికి గత ఆరు నెలల నుంచి కడుపు ఉబ్బినట్లు ఉండటం, మధ్యలో వాంతులు కావడం లాంటి సమస్యలున్నా, మందుల దుకాణాల వద్దకు వెళ్లి వాళ్లను అడిగి మందులు కొనుక్కోవడం, లేదా ఆర్ఎంపీ వైద్యుల సలహాలు తీసుకోవడంతో అసలు సమస్య ఏంటన్నది గుర్తించలేకపోయారు. చివరకు కర్నూలు వచ్చి కిమ్స్ ఆసుపత్రిలో చూపించుకోవడంతో ఇక్కడి సర్జన్ ముందుగా అనుమానించి సీటీ స్కాన్ చేసినప్పుడు కణితి ఉన్నట్లు తేలింది. కాకపోతే, అది చాలా సున్నితమైన ప్రదేశంలో ఉండటంతో శస్త్రచికిత్స కూడా సంక్లిష్టంగా మారింది. ఈనెల 15వ తేదీన ఆమెకు ఆపరేషన్ చేసి, విజయవంతంగా కణితిని తొలగించారు. ఒకవేళ తొలగించకపోతే, ఇది భవిష్యత్తులో కేన్సర్ కణితిగా మారే ప్రమాదం ఉంది, కొన్నిసార్లు అయితే అది పగిలిపోవచ్చు కూడా. అలా జరిగితే రోగికి ప్రాణాపాయం ఉంటుంది. అందువల్ల ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మందుల దుకాణాలకు వెళ్లి మందులు అడిగి తీసుకోవడం లేదా.. ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించుకోవడం కాకుండా.. వెంటనే నిపుణులైన వైద్యులకు చూపించుకోవడం మంచిది. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం కూడా ఉంటుంది’’ అని తెలిపారు.

ఈ శస్త్రచికిత్స చేసిన వైద్య బృందంలో కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ వసీమ్ హసన్ రజా షేక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, మత్తువైద్య నిపుణురాలు డాక్టర్ శ్రుతి తదితరులు ఉన్నారు.