గర్భంలో ఉన్న శిశువుని కూడా వదలని ధర్మం…!

అత్యాచారాలకి అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంత దుర్మార్గపు ప్రభుత్వమో ఎప్పటికప్పుడు చాటుతూనే వుంది.

ప్రజా వ్యతిరేక చట్టాలని తీసుకొస్తూ, తమది ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వమే అని నిర్మొహమాటంగా, బాహాటంగానే ప్రకటిస్తుంది. ఆ నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు ఎదురు తిరుగుతూ అనేక రకాలుగా నిరసనలు చేపడుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా తమ సిగ్గులేని తనాన్ని నిరూపించుకునేందుకు ఇంకో పనికిమాలిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆర్ఎస్ఎస్ ద్యారా నడుపబడుతున్న “గర్భ సంస్కారం” అనే పథకాన్ని యూపీ ప్రభుత్వం చట్టంగా తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

“గర్భ సంస్కారం “అంటే మరేమీ లేదు, తల్లి గర్భంతో ఉన్నపుడే కడుపులో వున్న బిడ్డకి ఆధ్యాత్మిక సంస్కారాన్ని కల్పించడం కోసం వాళ్ళు పవిత్రంగా భావించే భక్తి గీతాలని వినిపించడం, వేదాలని చదివించడం లేక చదివి వినిపించడం, తల్లితో పూజలు చేయించడం, ధ్యానం చేయించడం మొదలైనవి చేయడం.

ఈ రకంగా గర్భంతో వున్న తల్లికి “గర్భ సంస్కార” అనే ‘ఆధ్యాత్మిక చికిత్స” ఇవ్వడం వల్ల పుట్టబోయే బిడ్డ భారతీయ సనాతన సంప్రదాయం, హిందూ సంస్కారం తో పుడతాడని, పుట్టాలని వారి మొండి పట్టు.

దానికోసం మొదట సుందర్ లాల్ హాస్పిటల్ ను ఎంపిక చేశారు. ఇది యూపీలోనే మూడవ అతిపెద్ద రెఫరల్ హాస్పిటల్. ఈ ఆసుపత్రి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంతో ముడిపడి వుంది. గర్భంతో వున్న మహిళలకి ఈ హాస్పిటల్లోని ఆయుర్వేదిక్ విభాగంలో “గర్భ సంస్కార” చికిత్సని ఇస్తారు.

ఇందులో ఉన్న ఇంకో అతిపెద్ద మోసం ఏంటంటే గర్భంతో వున్న మహిళలకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత చికిత్స కావాలన్నా, ఫ్రీగా డెలివరీ చేయాలన్నా ఖచ్చితంగా ఈ “గర్భ సంస్కారం ” అనే సెషన్ కు హాజరు కావాలని ఆదేశించారు.

ఒక వేళ గర్భంతో వున్న మహిళ హిందువు కానప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఇది ఎంత అప్రజాసామ్యమో ఇట్టే తెలిసిపోతుంది. ఏ రకంగా చూసుకున్న ఇది రాజ్యాంగం స్ఫూర్తికి వ్యతిరేకం.

భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి ప్రత్యేకత అని గొప్పగా చెప్పుకుంటున్న దేశంలో, బలవంతాన హిందూ ధర్మాన్ని రుద్దడం ఏ రకంగా చూసిన రాజ్యాంగానికి వ్యతిరేకమే. పైగా తమ మెజారిటీ మత విశ్వాసాలను బలవంతాన చొప్పించేందుకు గర్భిణీలని పావులుగా వాడుకోవటం ఆటవిక చర్య గాక ఇంకేమిటి. ఇది జీవించే హక్కును కాలరాయడమే కాకుండా ప్రజల అస్తిత్వానికి, వారి నమ్మకాలకి వ్యతిరేక చర్య.

ఆడపిల్లలకు, మహిళలకి కనీస రక్షణ లేకుండా నిత్యం ఏదో ఒక చోట అత్యాచారాం,గృహహింస, హత్యలు జరుగుతున్న చోట బాధ్యతా యుతమైన ఏ ప్రభుతమైన చేయాల్సిన మొదటి పని మహిళలకు రక్షణ చట్టాలు, అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకోవాలి. అంతే కానీ ఇలా సంస్కారం పేరిట, సనాతన ధర్మం పేరిట సమాజాన్ని హిందూ మత విశ్వాసాలను రుద్దటం కాదు.

ఇది గర్భిణీలకు చికిత్స అందకుండా మానసికంగా వాళ్ళని ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, వాళ్ళ ప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుంది. ఇది ఆర్థికంగా వాళ్ళను కష్టాల పాలు చేయడమే. చికిత్స అందాలంటే హిందువుగా అయినా మారు లేదంటే చావనైనా చావు అనే ఈ రకమైన చర్యలు ప్రజా వ్యతిరేకమైనవి.


ధర్మం పేరుతో మనుషుల్ని ముక్కలుగా చీల్చి, లేదా వారిని మట్టుపెట్టాలని ప్రభుత్వం తెచ్చే ఇలాంటి తప్పుడు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించకపోతే, ఇప్పటికే మహిళలపై పెరిగిపోతున్న దాడులు, మానభంగాలు, హత్యలతో పాటు మహిళలు మరికొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అను శ్రీ…