ఆయ‌న‌కు ఓటేస్తే.. ఇదే గ‌తి!

  • కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల అర్ధ‌న‌గ్న నిర‌స‌న
  • టీఆర్ఎస్ నాయ‌కుడి భూక‌బ్జాల‌పై మండిపాటు

సుభాష్‌న‌గ‌ర్ డివిజ‌న్‌ (130)లో ప్ర‌చార‌ప‌ర్వం తార‌స్థాయికి చేరుకుంది. దీనికితోడు టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌ర్త‌, మాజీ కార్పొరేట‌ర్ అయిన గుడిమెట్ల సురేష్ రెడ్డి గ‌తంలో భూక‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌ని.. ఆయ‌న దాదాపు 45 రోజుల పాటు జైలుకు కూడా వెళ్లి వ‌చ్చార‌ని కాంగ్రెస్ పార్టీ అభిమానులు తీవ్రంగా మండిప‌డ్డారు. ఈ విష‌యం ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి లాంటి ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌ల‌లో కూడా వ‌చ్చిన విష‌యాన్ని వారు గుర్తుచేశారు. అలాంటి వ్య‌క్తి ముందుండి త‌న భార్య‌తో ఈసారి పోటీ చేయిస్తున్నార‌ని, వాళ్ల‌ను ఎన్నుకుంటే డివిజ‌న్ వాసుల‌కు ఇలాగే గుడ్డ‌లిప్ప‌దీసి నిల‌బెడ‌తారంటూ సుమారు 200 మందికి పైగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అర్ధ‌న‌గ్నంగా నిల‌బ‌డి మెయిన్ మార్కెట్ రోడ్డు ప్రాంతంలో ఆదివారం మ‌ధ్యాహ్నం దాదాపు అర‌గంట పాటు నిర‌స‌న ప్ర‌దర్శ‌న నిర్వ‌హించారు. క‌బ్జాకోరుల‌ను త‌రిమేద్దాం.. కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అంటూ నినాదాలు చేశారు. డివిజ‌న్ ప‌రిధిలో దాదాపు ప్ర‌తి ఇంటికీ వ‌చ్చి అంద‌రినీ ఆప్యాయంగా పల‌క‌రించే కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని తానం శ్రావ‌ణి శ్రీధ‌ర్‌రెడ్డిని ఎన్నుకుంటే ఈ ప్రాంతం స‌మ‌గ్రాభివృద్ధి చెందుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. వీరి వినూత్న నిర‌స‌న‌ను ప‌లువురు డివిజ‌న్ వాసులు ఆస‌క్తిగా తిల‌కించారు.