ఊపిరితిత్తుల క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలి

డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో:
ఊపితిత్తుల క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సివుందని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ్ అన్నారు. నవంబర్‌ నెలను లంగ్ క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకుంటున్న నేపథ్యంలో ఏవోఐ పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెరిగినట్లయితే రోగులకు తొలిదశలోనే చికిత్స అందించవచ్చని, తద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. ఆగకుండా దగ్గురావడం, విపరీతమైన అలసట, ఆకలి మందగించడం వంటి లక్షణాలున్నవారు వెంటనే దగ్గరలోని వైద్యుడిని గానీ, ఆంకాలజిస్టును గానీ సంప్రదించాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది, మనదేశంలో ఒక లక్ష మంది ఊపితిత్తుల క్యాన్సర్ బారినపడుతున్నట్లుగా తెలుస్తోందన్నారు. మొత్తం క్యాన్సర్ కేసుల్లో 10 శాతం ఊపితిత్తుల క్యాన్సర్ కేసులుండగా, మొత్తం క్యాన్సర్ మరణాల్లో 20 శాతం లంగ్ క్యాన్సర్ కారణంగానే సంభవిస్తున్నాయని తెలిపారు. పొగతాగేవారికి మాత్రమే ఊపితిత్తుల క్యాన్సర్ సోకుతుందనుకోవడం అపోహ మాత్రమేనని, లంగ్ క్యాన్సర్ పేషేంట్లలో దాదాపు సగం మంది పొగతాగే అలవాటు లేనివారు, పొగతాగే అలవాటు మానుకున్నవారే ఉండటం గమనించాల్సిన విషయమని చెప్పారు. ఆలస్యంగా వ్యాధిని గుర్తించడం, క్యాన్సర్ వలన సంభవించే దుష్ప్రభావాలు, సామాజిక మద్దతు లభించకపోవడం, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల లంగ్ క్యాన్సర్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందని అన్నారు. తొలిదశలోనే వ్యాధి లక్షణాలను గుర్తించి, చికిత్స తీసుకునేలా ప్రజల్లో అవగాహన పెంపొందించినట్లయితే మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. పొగతాగే దురలవాటుకు దూరంగా ఉండటమొక్కటే లంగ్ క్యాన్సర్ బారినపడకుండా వుండే ఏకైక మార్గంగా ఉన్నప్పటికీ, వాయు కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం ద్వారా లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అమెరికాలో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం ఊపితిత్తుల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో 10 శాతం మంది ప్రమాదకర ధూళికణాలు, విషవాయువుల కారణంగా వ్యాధి బారినపడినట్లు తేలిందన్నారు. లంగ్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను అతితక్కువ రేడియేషన్ ప్రభావంతో నిర్వహించడం జరుగుతుందని, తీవ్రమైన లక్షణాలున్న వారికి మాత్రమే ఈ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఊపితిత్తుల క్యాన్సర్ కు అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ అనిల్ కుమార్ లింగుట్ల పేర్కొన్నారు. ఏవోఐలోని నిష్ణాతులైన వైద్యుల నేతృత్వంలో లంగ్ క్యాన్సర్ వ్యాధికి కచ్చితమైన చికిత్స అందిస్తున్నామని ఆయన తెలియజేశారు.