జ‌న‌సేన పోటీ వ‌ల్ల ఏ పార్టీకి లాభం ?

హైద‌రాబాద్ గ్రేట‌ర్ పోటీలో దిగుతున్న జ‌న‌సేన పార్టీ వ‌ల్ల ఏ పార్టీకి లాభం క‌లుగుతుంది అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయ‌శంగా మారింది. ఇప్ప‌టికే ఏపీలో దోస్తీ చేస్తున్న భాజ‌పాకు ఇక్క‌డ మాత్రం ఒంటరిగా యుద్దం చేయ‌డానికి సిద్ద‌మ‌వుతుంది. జ‌న‌సేన పార్టీ గ్రేట‌ర్‌లో ఒంట‌రిగా పోటీ చేస్తే ఆ పార్టీ కంటే ఇత‌ర పార్టీల‌కే ఎక్కువ లాభం ఉంటుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీకి నష్టమా? లేక అధికార టీఆర్ఎస్‌కు నష్టమా? అనే చర్చ నడుస్తోంది. ఏపీలో ఈ రెండు పార్టీలు కలిసినడుస్తున్నాయి కనుక ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకు చీలి ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశమే ఎక్కువనే వాదన ఉంది. ఫలితంగా జనసేన రంగంలో ఉండడం అనేది చివరకు కాంగ్రెస్ పార్టీకి లాభించవచ్చని కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలా జరిగిన పక్షంలో గ్రేటర్‌లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే జరుగుతుందని వారు భావిస్తున్నారు. గ్రేటర్‌లో ఎక్కువ కార్పొరేటర్లు ఉన్న టీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ ఉండటంతో పాటు చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూ ఓట్లు అడుక్కోవచ్చని, ఇదేక్రమంలో మల్కాజిగిరికి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్పొరేటర్ల గెలుపు విషయంలో ప్రభావం చూపుతారని, దీంతో బీజేపీ, జనసేన ఓట్లు రెండుగా చీలిపోయి అటు కాంగ్రెస్ పార్టీకి లేదా టీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.