కరోనా బాధితులకు నరాల సంబంధిత సమస్యలు
– విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో విజయవంతంగా చికిత్స
డెక్కన్ న్యూస్, విశాఖపట్నం
కరోనా వ్యాధి సోకినప్పుడు జలుబు చేయడంతో పాటు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు వివిధ స్థాయుల్లో కనిపిస్తాయి. ఇంతకుముందు వచ్చిన వివిధ మహమ్మారుల్లో ఉన్నట్లుగానే కొవిడ్లోనూ నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ప్రధానంగా అనోస్మియా (వాసన తెలియకపోవడం), ఆగ్యూషియా (రుచి తెలికపోవడం), అటాక్సియా (నడుస్తున్నప్పుడు అదుపులేకపోవడం), మూర్ఛ, స్ట్రోక్ లాంటివి కొవిడ్లో వచ్చే నరాల సంబంధిత సమస్యలు. విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి ఇలాగే నరాల సంబంధిత సమస్యలతో వచ్చిన కొవిడ్ రోగికి చికిత్స చేసి, అతడి ప్రాణాలు కాపాడగలిగారు.
వారం రోజుల నుంచి జ్వరం, దగ్గు, నీరసం ఉన్నాయంటూ 58 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రికి తీసుకవచ్చారు. ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా, కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆయనకు దీర్ఘకాలంగా టైప్-2 మధుమేహం ఉంది, దానికి మందులు వాడుతున్నారు. అలాగే కోవిడ్‌కి సంబంధించిన మందులు వాడారు.
అయితే మూడోరోజు నుంచి ఆయనకు దుస్తులు పట్టుకోలేకపోవడం, అసహనం, గట్టిగా అరవడం లాంటి సమస్యలు మొదలయ్యాయి. పరీక్షించి చూడగా.. ఆయన బాగా అయోమయానికి గురవుతూ, కోపగించుకుంటూ, మాటలు వినిపించుకోకుండా కనిపించారు. దాంతో వెంటనే మెదడుకు ఎంఆర్ఐ చేయించగా మెదడువాపు వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. రోగిని ఎక్కువకాలం పాటు వెంటిలేటర్ మీద ఉంచడంతో ట్రాకియోస్టమీ కూడా చేశారు.
ఇలాంటి పరిస్థితుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కేసులు పరిశీలించగా.. ఐవీఐజీ (ఇమ్యూనో గ్లోబులిన్) అనే మందు వాడితే వీరికి నయమవుతోందని గుర్తించారు. ఇది ఒక బ్యాచ్‌లో 1000 నుండి 1500 మంది దాతల నుండి సేకరించిన రక్తం. ఇదే మందు ఇవ్వగా 3 నుంచి 5 రోజుల్లో పరిస్థితి మెరుగయ్యింది. రెండువారాల అనంతరం పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఎలాంటి సాయం లేకుండా నడవగలుగుతున్నారు. కొవిడ్ మహమ్మారి కేసులు ఒకవైపు తగ్గుతున్నా.. ఇప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో పాటు ఇలాంటి నరాల సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలను సరిగ్గా గుర్తించగలిగితేనే రోగులకు తగిన చికిత్స అందించి వారిని కాపడటం వీలవుతుంది.