ఉత్కంఠంగా దుబ్బాకా ఎన్నిక‌ల ఫ‌లితాలు

మొత్తానికి దుబ్బాక ఎన్నిక‌లు కాక పుట్టిస్తున్నాయి. ఎవ‌రు గెలుస్తారు అనే ఉత్కంఠంగా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల తర్వాత గెలుపు ఓటములపై ఓ క్లారిటీ రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు దారితీసిన ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్​ఎస్​ తరఫున సోలిపేట సుజాత, బీజేపీ తరఫున రఘునందన్​రావు, కాంగ్రెస్​ తరఫున చెరుకు శ్రీనివాస్​రెడ్డి బరిలో దిగారు. గెలుపుపై మూడు పార్టీలు ధీమాతో ఉన్నాయి.
అయితే టీఆర్​ఎస్​ లీడర్లలో మాత్రం ఎప్పుడు లేని టెన్షన్ కనిపిస్తున్నది. 2018 ఎన్నికల్లో 62 వేల ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకలో విజయం సాధించారు. రామలింగారెడ్డి మరణంతో ఈ ఉప ఎన్నికలో 82.61 శాతం పోలింగ్​ నమోదయింది. 1,64,186 మంది ఓటు వేశారు. ఇంత భారీ స్థాయిలో పోలింగ్​ నమోదవడంతో ఏ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తుందన్నది ఆసక్తి కలిగిస్తున్నది. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో జెండా ఎగురేస్తామని, గతంలో వరుసగా రెండు సార్లు ఓటమి చెందిన రఘునందన్ కు ఈసారి ఆ సానుభూతి కలిసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఉనికి కోసం తీవ్రంగా కష్టపడింది. సొంత పార్టీలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకొని పోటీలో దింపింది.
23 రౌండ్లలో లెక్కింపు
కౌంటింగ్ కోసం సిద్దిపేటలోని ఇందూర్​ ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 23 రౌండ్ల లో ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్​ ప్రారంభిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల్లోని ఓట్లు కౌంట్ చేస్తారు. ఒక్కో గదిలో ఏడు టేబుళ్ల చొప్పున 14 టేబుళ్లపై ఒక్కో రౌండ్​లో 14 పోలింగ్ బూతుల్లో పోలైన ఓట్లను కౌంట్​ చేస్తారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్​కు 20 నిమిషాలు పట్టే చాన్స్​ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు కౌంటింగ్​ పూర్తవుతుందని ఆఫీసర్లు అంటున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 357 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో బుధవారం ఉదయం వరకు ఎలాంటి విజయోత్సవాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ భారతి హోళికేరి పరిశీలించారు.