తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా వైరస్ తన ప్రతాపాన్ని మళ్లీ చూపిస్తోంది. 2019 సంవత్సరంలో చైనాలో పుట్టిన ఈ వైరస్ గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలన్ని ఘడఘడలాడించింది. దీంతో అన్ని దేశాలు లౌక్ డౌన్ విధించి తమ ఛాయశక్తులుగా కష్టించి కాస్తో కూస్తో కట్టడి చేసి కాస్తా ఊపిరి పీల్చుకుందాం అనుకునే సమయంలో మళ్లీ పగడ విప్పింది ఈ వైరస్. అసలే చలికాలం పైగా సీజనల్ వ్యాధులతో బాధపడే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
తెలంగాణలో గత నెల 25న రాష్ట్రం మొత్తం 582 కేసులు నమోదవగా, 31నాటికి 1,416కు పెరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా పెరిగినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు కరోనా బులెటిన్ విడుదల చేశారు. దీని ప్రకారం గత నెల 25న జీహెచ్‌ఎంసీలో 174 కేసులుండగా 31న 279కి చేరాయి. ఇదే తేదీల్లో ఆదిలాబాద్‌లో 9 నుంచి 18కి, భద్రాద్రి కొత్తగూడెంలో 22 నుంచి 79కి, ఖమ్మంలో 17 నుంచి 74కు, జనగామలో 2 నుంచి 21కి, మేడ్చల్‌లో 38 నుంచి 112కు, రంగారెడ్డిలో 55 నుంచి 132, వరంగల్ అర్బన్‌లో 7 నుంచి 22కు పెరిగాయి. కామారెడ్డిలో 25న ఒక్క కేసు నమోదు కాకపోగా, 31న 24 నమోదయ్యాయి. ఇలాగే మిగిలిన జిల్లాల్లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదయ్యింది. దసరా సమయంలో తక్కువ కేసులు నమోదవగా, ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి. చలికాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది.