కవితకు లైన్ క్లియర్ చేస్తున్నారా ?
రాష్ట్ర మంత్రి రాసలీలలు ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ కాకా పుట్టించాయి. ఓ వైపు దుబ్బాక ఎన్నికలు మరోవైపు మంత్రి రాసలీలలు అంశం. ఎక్కడ చూసిన ఇదే చర్చ. ఏ మంత్రి.. ఎవరితో.. ఎలా.. ఇదే హాట్ టాపిక్ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తోంది. అయితే ఈ వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర కూడా దాగుందనే అనుమానాలు కూడా సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవితను మంత్రి వర్గంలో తీసుకునేందుకే మంత్రి వ్యవహారం తెరమీదకు వచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఓ యువతిని తన సొంతం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దీంతో మీడియాలో ఆ మంత్రిపై వరుస కథనాలు ప్రసారమయ్యాయి. మంత్రిగా ప్రజలకు సేవచేయాల్సిన వ్యక్తి ఇలా అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసింది ఆ మీడియా. దీంతో ఆ మంత్రి సంజాయిషీ ఇచ్చుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వార్త కథనాలు ప్రసారం కావడంతో రంగంలోకి దిగిన ఇంటెలీజెన్స్ సిబ్బంది ఏం జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
ఈ కథనాలు ప్రసారం చేసింది కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఓ మీడియా సంస్థనే. ఉన్నట్టుండి తమ క్యాబినేట్ లో ఉండే మంత్రిపైనే.. యువతిని ట్రాప్ చేసాడంటూ వార్తలు రావడంతో సొంత పార్టీ నేతలకే ఏం జరుతుందో అర్థం కాని పరిస్థితి. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నారన్న అభిప్రాయాలు పలువురిలో వ్యక్త మవుతున్నాయి. అయితే కవితను క్యాబినేట్ లో చొప్పించేందుకే ఈ కథ నడుస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజులోనే ఇలా మంత్రి రాసలీల వ్యవహారం మీడియాలో రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కవిత మంత్రి పదవి కోసం.. ఒక స్థానం ఖాలీ చేసేందుకే ఈ పరిణామాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలను సదరు మంత్రి అభిమానులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేయాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించే ఆ సంస్థ ఏకంగా క్యాబినేట్ మంత్రినే టార్గెట్ చేసారంటే ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, డైరెక్షన్ లేకుండానే చేసారా అంటే అనుమానమే. దీంతో ఈ వార్త ప్రసారం వెనక పెద్ద కుట్రే ఉందన్న చర్చ సాగుతోంది.
రాజయ్యపై కూడా ఇలాంటి ఆరోపనే
మంత్రులపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి కాదు . తెలంగాణ తొలి క్యాబినేట్ లో కూడా కీలక శాఖకు మంత్రిగా ఉన్న టి.రాజయ్య ఉన్న ఫలంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఆయనపై కూడా ఇలాంటివి, అవినీతి ఆరోపణలే వచ్చాయి. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడాని ఆయనపై పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. రాజయ్యను మంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేశారని ఆయన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయితే తన సామాజిక వర్గానికి శాంతింపజేసేందుకు ఆ వెంటనే మరో పార్టీ నుండి వచ్చిన అదే సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరికి మంత్రి పదవి కట్టబెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆనాడు కావాలనే ఆ మంత్రిని అవమాన కరంగా క్యాబినేట్ నుండి తొలగేలా చేసారంటున్నారు విశ్లేషకులు.
కవిత కోసం లైన్ క్లియర్ చేస్తున్నారా ?
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే తరహాలో ఉండటంతో ఎక్కడో ఏదో తేడా జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కవిత రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఎమ్మెల్సీగా అది సాధ్యం కాదు. ఎమ్మెల్సీగా ఉంటే తను కేవలం ఆ నియోజకవర్గం వరకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అదే ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి చేపడితే రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొనవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎంపీగా ఓడిపోయిన కవితను తెరముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే కేవలం 15 నెలల పదవి కాలం ఉన్నాగానీ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి మరీ గెలిచి మంత్రి వర్గంలో వచ్చేలా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది.











