ఎల్లలు దాటినా బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ పండుగ కేవలం ఒక్క తెలంగాణకే గర్వకారణం. కానీ ఇప్పుడు ఆ సంబరం ఎల్లలు దాటి తెలంగాణకి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చి పెడుతుంది. పూలతో భగవంతుని పూజించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంప్రదాయం, కానీ ఆ పూలనే గౌరీ దేవిగా పూజించడం ఒక్క తెలంగాణలోను ఉన్న గొప్ప సంస్కృతి అంటున్నారు ఆస్ట్రేలియాలో స్థిర పడిన శ్వేతా. భారతదేశంలో ఉన్న అందరికి ఆమె బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ బతుకమ్మ గురించి చెబుతుంటే ప్రతి ఒక్కరు ఎంతో గౌరవంగా చూస్తున్నారు అని తెలిపారు.
అయితే ప్రతి సంవత్సరం లాగ ఒకే చోట గుమిగూడకుండా, కోవిడ్ వాతావరణానికి అనుకూలంగా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వినూత్నంగా అంతర్జాలంలో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఆన్లైన్‌లో బతుకమ్మఆటాపాటతో వేడుకను జరుపుకున్నారు. సిడ్నీలోని అన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ వాసులు ఆన్‌లైన్ బతుకమ్మ సెలెబ్రేషన్స్‌లో పాల్గొనడం జరిగింది. గౌరమ్మను కరోనా నుంచి కాపాడమని ఎస్‌బీడీఎఫ్ మహిళామణులు పాటలు రాసి పాట రూపకంగా వేడుకున్నారు. ఎస్‌బీడీఎఫ్ ప్రధాన ఆశయాలలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించటం ప్రధానమైనది.
సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు తీసుకొనిపోవాలంటే ఇప్పటి యువతీయువకులకు, పిల్లలకు వాటిని నేర్పించాలని ఎస్‌బీడీఎఫ్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. అలా చేస్తే అది భావితరాలకు సంక్రమిస్తుందని అన్నారు. ఈ లక్ష్యం కార్యరూపం దాల్చే దిశగా ఎస్‌బీఎఫ్ అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. బతుకమ్మ సంబరం వర్చువల్‌గా చేసుకున్నప్పటికి.. అందరూ ఆన్‌లైన్‌లో ఒక్కచోటకు చేరి బతుకమ్మను వేడుకగా జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందని శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ తెలిపారు. ఈ బతుకమ్మ సంబురాల్లో సుమారు 500 మంది వరకు వర్చువల్‌గా పాల్గొన్నారు.