కోదండరాం అంటే అంత భమమెందుకు ?
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా మారింది. ఏ పార్టీకి ఆ పార్టే తాము బలంగా ఉన్నామంటే తామే బలంగా ఉన్నామంటూ ప్రకటించుకుంటున్నాయి. టీఆర్ఎస్ నుండి టీజేఎస్ వరకు అన్ని పార్టీలు వీటిపైనే స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దీంతో ఈ ఎన్నికలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఇక గెలుపు కంటే ముందు ప్రత్యర్థిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ప్రధాన పార్టీలు పక్కన పెడితే వామపక్షాలు, టీజేఎస్, ఇంటి పార్టీల రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకుంటున్నారు. ఈ మూడు పార్టీలు తాము బలపరిచే అభ్యర్థులను ఓకే చేయడంతో ఇక ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళిపోయాయి.
ఇప్పటికే కోదండరాంపై తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అయిన వరంగల్ నియోజక వర్గంలో పోటీ చేసేందుకు అనర్హుడంటూ ప్రకటించారు. ఆయన గౌరవంగా ఎన్నికల బరినుండి తప్పుకోవాలంటూ సూచించారు. ఇక మరోవైపు వామపక్షాలు సైతం కోదండరాంపైనే కాన్సంట్రేట్ చేసాయి. కోదండరాం అనుచితంగా మాట్లాడుతున్నారంటూ విరుచుకు పడుతున్నాయి. ఈ నియోజక వర్గానికి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్నాదానిపై ఏకాభిప్రాయం కోసం ఏర్పాటు చేసిన సమావేశం కోదండరాంకు వామపక్షాలకు మధ్య దూరం పెంచింది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాగేశ్వర్‌రావ్‌కు టీజేఎస్ మద్దతివ్వదంటూ తెగేసి చెప్పటమే వామపక్ష నేతలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. బీజేపీని ఓడించేందుకు నాగేశ్వర్ రావును బలపర్చాల్సింది పోయి ఇలా ఏకపక్షంగా మాట్లడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు తమ్మినేని. వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఓ అభ్యర్థిని బలపరుస్తున్నామని చెప్పిన వామపక్షాలు కోదండరాం వ్యవహారం మింగుడు పడటం లేదు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వమని చెప్పడం వెనక ఓ రీజన్ ఉందట. నాగేశ్వర్ ఎమ్మెల్సీ బరిలో ఉంటే టీఆర్ఎస్ ఆయననే బలపరుస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పడమే ఆ రీజన్. దీంతో టీఆర్ఎస్ అంటేనే పడని కోదండరాం నాగేశ్వర్ ను బలపర్చే ప్రసక్తే లేదని పార్టీ నేతలతో చెప్పి పంపారని సమాచారం. దీంతో వామపక్షాలు కోదండరాం మధ్య గ్యాప్ పెరిగింది అంటున్నారు. ఓ వైపు చెరకు సుధాకర్, మరోవైపు వామపక్షాలు ఇలా కోదండరాంకు శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన కోదండరాం తన ఉనికిని ఎలా చాటుకుంటారు.. అన్ని పార్టీల వ్యతిరేకతను తట్టుకుని ఎలా విజయం సాధిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.