కువైట్ లో పనిచేసే మహిళకు కిమ్స్ లో అరుదైన శస్త్రచికిత్స
- ముక్కు వెనక భాగంలో సోకిన క్యాన్సర్
- శస్త్రచికిత్సతో ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యబృందం
- కువైట్ దేశంలో పనిచేస్తున్న ఓ మహిళకు కిమ్స్ సికింద్రాబాద్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన చికిత్స జరిగింది. అతి వేడి ప్రాంతంలో ఉండటంలో పాటు.. దుమ్ము, ధూళి ఎక్కువగా ముక్కులోకి వెళ్లడం వల్ల ఆమెకు కేన్సర్ రెండోసారి వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ముక్కు వెనక భాగంలో ఉండే రంధ్రాల వద్ద కేన్సర్ సోకడం వల్ల శ్వాస కూడా అందక.. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని, దీనికి వెంటనే సరైన చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని కన్సల్టెంట్ ఈఎన్ టీ సర్జన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
కడప జిల్లాకు చెందిన వెంకట సుబ్బమ్మ (45) కువైట్ దేశంలో వంట పని చేస్తుంటారు. పెద్దపెద్ద పాత్రలలో ఎక్కువ మందికి ప్రతిరోజూ మాంసాహార వంటలు చేయాల్సి వచ్చేది. బాగా వేడి వాతావరణం, నూనె నుంచి వచ్చే పొగలు, మసాలా వాసనలు.. వీటన్నింటికీ తోడు ఆ ప్రదేశంలో ఉండే దుమ్ము కారణంగా ఆమెకు కేన్సర్ సోకింది. రెండేళ్ల క్రితం ఒకసారి కేన్సర్ రాగా.. కర్నూలులో వైద్యులకు చూపించారు. అక్కడ బయాప్సీ చేసి రేడియేషన్ ఇచ్చారు. తర్వాత రెండు కీమోలు తీసుకుని, ఆమె తిరిగి కువైట్ వెళ్లిపోయారు. మరో నాలుగు కీమోలు తీసుకుని ఉంటే వ్యాధి పూర్తిగా నయమయ్యేది. కానీ సరైన సమయంలో సరైన వైద్యం అందకపోవటంతో ఆమెకు వ్యాధి తిరగబెట్టింది. నాసోఫెరింజల్ కార్సినోమా అనే ఈ రకం కేన్సర్ చాలా తీవ్రమైన స్వభావం కలిగి ఉంటుందని డాక్టర్ సుబ్రహ్మణ్యం వివరించారు. దీన్ని గుర్తించేసరికే మూడోదశలోకి వెళ్లిపోతుందన్నారు. ముక్కు బయట ఉన్నట్లే దీని వెనక భాగంలో కూడా రెండు రంధ్రాలుంటాయని, అక్కడ కేన్సర్ రావడంతో ఎండోస్కొపీ పరికరంతో పాటు.. కణితిని తొలగించే పరికరాలను కూడా అత్యంత సంక్లిష్టమైన రీతిలో పంపాల్సి వచ్చింది. ఆ పక్కనే మెదడుకు రక్తం సరఫరా చేసే నరాలు ఉంటాయి. అక్కడ రక్తస్రావం అయితే నియంత్రించడం కష్టమై, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అదృష్టవశాత్తు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలకు తోడు అనుభవం కలిగిన ఎనస్థీషియా వైద్యుల బృందం ఉండటంతో ఒక్క చుక్క కూడా రక్తం పోకుండా శస్త్రచికిత్స పూర్తయింది. రెండు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేసి, ప్రస్తుతం పాలియేటివ్ రేడియేషన్, కీమోథెరపీ అందిస్తున్నారు.
ఈ తరహా క్యాన్సర్ చాలా తక్కువమందిలో వస్తుందని, ఇది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సరైన సమయంలో ఈ శస్త్రచికిత్స చేయకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం తలెత్తుతుందని హెచ్చరించారు.
పాటించవలసిన జాగ్రత్తలు
అతి వేడి ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
దుమ్ము, ధూళి ముక్కులోకి వెళ్లకుండా మాస్కులు ధరించాలి.
లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
శస్త్రచికిత్స చేసిన తరువాత క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
వంట చేసే సమయంలో కూడా వేడి తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.